వలసలు సహజం


పార్టీలు పెట్టడం ఫ్యాషనైంది : బొత్స
హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) :
ఎన్నికల ముందు వలసలు సహజమని, అయితే రాజకీయాల కోసం పార్టీ మారితే ప్రజలు ఛీత్కరిస్తారని పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు పార్టీ వీడుతున్నారని ఆయన విమర్శించారు. కాలం మార్పునకు సూచికని, మార్పు అభివృద్ధికి సూచిక అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీనం అధిష్టానానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. అది తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన పార్టీ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్న దృష్ట్యా పార్టీని కొనసాగిస్తారో, లేదో వారే నిర్ణయించుకోవాలని అన్నారు. అలాగే ఇప్పుడు పార్టీలు పెట్టడం ఫ్యాషనైపోయిందని పకోక్షంగా ఆయన మాజీ సిఎం కిరణ్‌ను ఉద్దేశించి అన్నారు. ఆయన శనివారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. పార్టీలు పెట్టడం ఫ్యాషనైపోయిందని, కొందరు డబ్బులు దండుకోవడానికే పార్టీలు పెడుతున్నారని అన్నారు. ప్రజల్లో ఉన్న తాత్కాలిక విభేదాలను రాజకీయాల్లో వాడుకునేందుకు కిరణ్‌ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నట్లు బొత్స ఆరోపించారు. పార్టీలను ప్రైవేటు కంపెనీల్లా టేకోవర్‌ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రిజిస్ట్రేషన్‌ చేయకుండానే తన పార్టీని ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు వలసలు సహజమని, రాజకీయాల కోసం పార్టీ మారితే ప్రజలు ఛీకొడతారని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారని బొత్సఅన్నారు. రాష్ట్ర విభజన జరిగినా.. జరక్కపోయినా పార్టీ నుంచి వెళ్లేవారు వెళ్లిపోతారని ఆయన తెలిపారు. తాము జగన్మోహన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా అవాస్తవాలు మాట్లాడలేమని అన్నారు. ఆస్తులండబట్టే సింగపూర్‌ గురించి చంద్రబాబు ప్రమోట్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాలం మార్పు తీసుకువస్తుందని.. మార్పు అభివృద్ధికి సూచకమని బొత్స అన్నారు. దేశంలో మెరుగైన ప్రాంతంగా సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం సీమాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకెళ్లి విభజన వల్ల సీమాంధ్రకు మేలే జరిగిందని చెబుతామన్నారు. తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌ పార్టీలో విలీనమవుతుందా లేక పొత్తు పెట్టుకుంటుందా అనే విషయం కాంగ్రెస్‌ అధిష్టానం చూసుకుంటుందని బొత్స చెప్పారు. తెలంగాణ వచ్చింది కాబట్టి అది కాంగ్రెస్‌లో విలీనమవుతుందా, లేక రాజకీయ పార్టీగా కొనసాగుతుందా అనే విషయాన్ని టీఆర్‌ఎస్‌ పెద్దలే చెప్పాలని అన్నారు. విలీనం అంశం హైకమాండ్‌ పరిధిలోనిదని, దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని తెలిపారు. జైరామ్‌ రమేష్‌ టీఆర్‌ఎస్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాని కేసీఆర్‌ మాత్రం జైరామ్‌ రమేష్‌ను కించపరిచేలా మాట్లాడడం సరికాదని బొత్స అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల పీసీసీల విషయాన్ని అధిష్ఠానం రెండు రోజుల్లో తేలుస్తుందని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ చెప్పారు. రెండు రాష్ట్రాలకు వేరువేరు పీసీసీలా, రెండు ప్రాంతీయ కమిటీలా లేక ఒక్క పీసీసీ కిందే రెండు పీసీలల అనే విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. న్నికల ముందు రాజకీయ వలసలు సహజమేనని, అయితే కాంగ్రెస్‌ నుంచి వలసలను ప్రోత్సహిస్తూ టీడీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇక సీమాంధ్రలోని నాలుగు జిల్లాల కాంగ్రెస్‌ కమిటీలకు కొత్త ఇంచార్జులను నియమించినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. పశ్చిమగోదావరికి ఎం.వెంకటేశ్వరరావు (రత్నం), నెల్లూరుకు ధనుంజయరెడ్డి, చిత్తూరుకు వేణుగోపాలరెడ్డి, అనంతపురానికి మాజీ ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డిలను నియమించామన్నారు. ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సీమాంధ్ర డీసీసీ, సీసీసీ అధ్యక్షులు ఆప్రాంత బేరర్లతో సమావేశం ఉంటుందని, ఆ సందర్భంగా సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచన చేయనున్నామని చెప్పారు.