పునర్నిర్మాణంలో సైనికులం
జాక్ రాజకీయ పార్టీగా మారదు
ఉద్యమకారులకు పార్టీలు ప్రాధాన్యతివ్వాలి : కోదండరామ్
హైదరాబాద్, మార్చి 1 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీ-జేఏసీ) రాజకీయ పార్టీగా మారదని కన్వీనర్ కోదండరామ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా మారడం అన్నది అసాధ్యమన్నారు. ఇది స్వతంత్రంగానే ఉంటూ తెలంగాణ పునర్నిర్మాణంలో తనవంతు బాధ్యతను నిర్వహిస్తుందని అన్నారు. తాము సైనికుల్లా పునర్నిర్మాణంలో ముందుటామన్నారు. తమ సంఘం రాజకీయ పార్టీ కాదు, కాలేదని తెలంగాణ కోదండరామ్ అన్నారు. ప్రజా సంఘాలు స్వభావ రీత్యానే రాజకీయ పార్టీలుగా మారబోవని ఆయన అన్నారు. తెలంగాణ జేఏసీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ జేఏసీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాజకీయాలను తక్కువ చేసి చూసే ఉద్దేశం తమకు లేదని, ప్రజా సంఘం రాజకీయ పార్టీలకూ ప్రజలకూ మధ్య వారధిలా పనిచేస్తుందని ఆయన చెప్పారు. అయితే వారధే రాజకీయ పార్టీగా మారదన్నారు. ఉద్యమ నేతలు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని, ఉద్యమ నాయకులకు రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని ఆయన అన్నారు. అలాగే జెఎసిసి కొందరికి రాజకీయ ఆకాంక్ష ఉంటే తాము కాదనలేమన్నారు. అంతమాత్రాన తాము రాజీకయ పార్టీగా అవతరించమన్నారు. తెలంగాణ ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా పనిచేశాయని అన్నారు. అయితే టిడిపి, వైకాపాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు. సహజంగానే ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తామన్నారు. అవసరమైనప్పుడు తమ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోషించాల్సిన పాత్రపై చర్చించలేదని ఆయన అన్నారు. పోలవరం ముంపు గ్రామాల సమస్య తెలంగాణకు మాత్రమే సంబంధించింది కాదని, అది ఆదివాసీలందరి సమస్య అని ఆయన అన్నారు. ఇక్కడ వారి జీవితాలతో ముడిపడి వున్న ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడడం తగదన్నారు. ఇరుప్రాంతాల నేతలు దీనిని గిరిజన సమస్యగా చూడాలన్నారు. వీరి హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా తాము పోరాటం చేస్తామని చెప్పారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ సిద్దంచేస్తామన్నారు. తమకు అన్యాయం జరక్కుండా చూసుకుంటామన్నారు. అపాయింటెడ్ డేను వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ జెఎసి ఇకముందు కూడా కొనసాగుతుందని ఆయన చెప్పారు. తాము రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకమే అయినప్పటికీ అనివార్యమైన స్థితిలో సమర్థిస్తున్నామని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతల కారణంగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని కోదండరామ్ చెప్పారు. మరో రెండు రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని, ఈ నెల 11వ తేదీ నుంచి విజయోత్సవ సభలు నిర్వహిస్తామని చెప్పారు. విజయోత్సవ ర్యాలీకి ఒక కమిటీని వేయడం జరిగిందని కోదండరాం చెప్పారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుతామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మళ్లీ ఐకాస సమావేశం అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఒక సంస్థగా పాల్గొనలేదని, అలాగే జేఏసీ రాజకీయ పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు..పార్టీలకు మధ్య వారధిగా మాత్రమే పనిచేస్తుందని, ఒక వాచ్ డాగ్ పాత్రననేన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్రపోషించిన వారికి రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని తెలిపారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరగాలని తెలంగాణ ఐకాస కోరుతోందన్నారు. సీఎం కిరణ్, సీమాంధ్ర వాళ్లు రాష్ట్రంలో అనవసర రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారని విమర్శించారు. అన్ని పార్టీల ప్రమేయంతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. అంతేకాని ఏ ఒక్క పార్టీ విజయమో కాదని స్పష్టం చేశారు. అనంతరం టీ-జేఏసీ నేతలు మాట్లాడుతూ… రాష్ట్రపతి పాలనను తక్షణం ఎత్తివేయాలి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ, ప్రజాసంఘాల, ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. కేంద్ర రాష్ట్రపతి పాలన విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో తెలంగాణ జేఏసీ ఉంటుందన్నారు. భవిష్యత్‌లో మేం వాచ్ డాగ్ పాత్రను పోషిస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. తెలంగాణ వచ్చినా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని సమష్టిగా పరిష్కరించు కుంటామన్నారు. త్వరలో విజయోత్సవ సభలు నిర్వహిస్తామని టీ జేఏసీ నేతలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అపాయింటెడ్ డేను వెంటనే ప్రకటించాలని కోదండరామ్ అన్నారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరగాలని తెలంగాణ ఐకాస కోరుతోందన్నారు. సీమాంధ్రకు స్వయం ప్రతిపత్తి కల్పించినట్లే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని టీజీఓ నేత శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సీమాంధ్రలో పరిశ్రమలకు కేంద్రం పన్ను రాయితీ కల్పించిందని, దీనివల్ల పరిశ్రమలన్నీ అక్కడికి తరలిపోతున్నాయని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే అవకాశముందని చెప్పారు. వెనుకబడిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామని, తమకు కాకుండా సీమాంధ్రకు ఏవిధంగా పన్ను రాయితీలు కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ సెమినార్‌లో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, పారిశ్రామిక నేతలు పాల్గొన్నారు.