తెలంగాణ గెజిట్ విడుదల
త్వరలో అపాయింటెడ్ డే
ముంపు ప్రాంతాలు సీమాంధ్రకే.. : జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్ విడుదలైంది. తెలంగాణ బిల్లు చట్టరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచారు. మొత్తం 70 పేజీలతో చట్టం రూపొందించారు. మార్చి 1, 2014న గెజిట్ విడుదల చేసినట్టు పేర్కొంది. శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఇక అపాయింటెడ్ డే జారీ మాత్రమే మిగిలి ఉంది. మరో మూడు నెలల తర్వాతే అపాయింటెడ్ డే జారీ చేస్తామని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరామ్ రమేశ్ తెలిపారు. ఆదివారం ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా కేటగిరి కింద నిధుల కేటాయింపునకు ప్రణాళిక రూపొందించాలని ప్రణాళికా సంఘానికి మార్గదర్శకాలు జారీ చేసింది. భద్రాచలం పట్టణం మినహా భద్రాచలం డివిజన్, బూర్గపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కూనవరం, చింతూరు, అశ్వారావుపేట, వేలేరుపాడు, వర రామచంద్రాపురం మండలాలను సీమాంధ్రలో కలుపనున్నారు.