విలీనం ముచ్చటే లేదు
జనం వద్దన్నారు
పొత్తుపై కేకేతో కమిటి
టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసే ముచ్చటే లేదని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విలీనం చేయొద్దని జనం నుంచి తెలంగాణ వ్యాప్తంగా తనకు చాలా సందేశాలు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా తమని సంప్రదించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తామిచ్చిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కటీ పరిశీలించలేదన్న కేసీఆర్, బిల్లు రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీ తెరాసను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఆంధ్రా ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినా ఫర్వాలేదు కానీ తమకు ఇవ్వాలన్నారు.
విలీనంపై సోనియా సంప్రదించలేదు.
తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయమని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తమను ఎప్పుడూ సంప్రదించలేదని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌కు అవకాశముంటే తప్పకుండా మద్దతిస్తామన్నారు, పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రకు బదలాయించడంపై సుప్రీంలో కేసు వెస్తామన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. దీంతో తెలంగాణలోని తెలుగుదేశం నేతలు తెరాసలోకి వస్తున్నారని ఆయన తెలిపారు.
పక్కా రాజకీయ పార్టీగా తెరాస…
తెలంగాణలో తెరాస పక్కా రాజకీయపార్టీగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో తెరాస కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణం తెరాసతోనే సాధ్యమన్నారు. సీమాంధ్రలో రెండు ప్రాంతీయ రాజకీయపక్షాలుండగా తెలంగాణ భవన్‌లో తెరాస ప్రభావశక్తిగా ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తెలంగాణకు అన్యాయం…
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలతో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్ ఆరోపించారు. లోయర్ సీలేరును సీమాంధ్రలో చేర్చడంతో పాటు పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్స్ విషయంలో జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, డీఎన్‌లు చురుగ్గా వ్యవహారించలేకపోయారని ఆయన విమర్శించారు.
14 ఎంపీ స్థానాలు గెలుస్తాం…
తెలంగాణలో తెరాస 14 లోక్‌సభ స్థానాలను గెలుస్తుందని అనేక సర్వేలు పేర్కొన్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వాణి వినిపించేందుకు తెరాస ఉంటుందన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన రాగానే తమ పిలుపు మేరకు వేలాదిమంది తెలంగాణ వాదులు ఆందోళన చేయడంతో కేంద్రం ఆ ప్రతిపాదనను ఆపివేస్తుందన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో విలీనం అవుతామని గతంలో చెప్పామని అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తదితర అంక్షలతో కూడిన తెలంగాణను కేంద్రం ఇచ్చిందన్నారు. తెలంగదాణలో 100 మంది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తమన్నా విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.