గుజరాత్ వికాస్ ఉత్తుత్తిదే
అభివృద్ధి పరిశీలనకు వచ్చిన కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీలో బీజేపీ కార్యాలయం ముందు నిరసన
యూపీలో ఆప్ కార్యకర్తలపై భాజపా అమానవీయ దాడి
అహ్మదాబాద్, మార్చి 5 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ భారీ ఎత్తున్న చేస్తున్న గుజరాత్ వికాస్ ప్రచారం ఉత్తదేనని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. గుజరాత్‌లో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన కేజ్రీవాల్‌ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరో వైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆప్ కార్యకర్తలపై అమానవీయదాడికి తెగపడ్డారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. నరేంద్రమోడీ సొంతగడ్డ గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజీవ్రాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఆయనను, ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజీవ్రాల్ రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. గుజరాత్‌లో అభివృద్ధిని పరిశీలించడానికి ఆప్ నేతలు ఆ రాష్ట్రంలో నాలుగురోజుల పర్యటన బుధవారం ప్రారంభించారు. అయితే అనుమతి లేకుండా పర్యటనలు, ర్యాలీలు చేపట్టడంతో ఈ చర్య తీసుకున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చెబుతున్న అభివృద్ధిని అంచనా వేసేందుకు గుజరాత్ లో పర్యటిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ చేదు అనుభవం ఎదురైంది. నాలుగు రోజుల పర్యటన కోసం గుజరాత్ లోని పటాన్ చేరుకున్న కేజ్రీవాల్‌కు నల్ల జెండాలతో మోడీ మద్దతుదారులు స్వాగతం పలికారు. గుజరాత్ వ్యతిరేకి కేజ్రివాల్ అంటూ నినాదాలు చేశారు. నర్మద ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న సామాజిక కార్యకర్త మేధా పాట్కార్ మా దేవత, గుజరాత్ ప్రాణదాత అంటూ అందోళనకారులు నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ అరవింద్ కేజ్రివాల్‌ను అరగంట సేపు రాధాన్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విడుదలైన కేజ్రివాల్ మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ రైతు వ్యతిరేకి అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నిల్లో ఆప్‌కు, బిజెపికి మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. గుజరాత్‌లో అభివృద్ధిని పరిశీలించడానికి నాలుగు రోజుల పాటు పర్యటించేందుకు బుధవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విూడియాతో మాట్లాడారు. గుజరాత్ లో రామరాజ్యం నడుస్తోందని, విద్య, వైద్యం, అవినీతి తదితర సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాను ఆ అభివృద్ధిని పరిశీలించడానికే ఈ పర్యటన చేపట్టినట్లు చెప్పారు. బిజెపి ఈ ఎన్నికల్లో ఎంతెంత ఖర్చు పెడుతుందని, ఆ పార్టీకి నిధులు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేది బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తారా? అని కేజీవ్రాల్ ప్రశ్నించారు. ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ఉన్నారు.