ఆంధ్రాకు ప్రత్యేక హోదా ప్రమాదం

వెనుకబడ్డ తెలంగాణాకే ఇవ్వాలి
పోలవరంపై కార్యాచరణ రూపొందిస్తా : కోదండరామ్‌
హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం ప్రమాదకరమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణాకే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికి కార్పొరేట్‌ శక్తుల కబంధహస్తాల నుంచి ఇంకా విముక్తం జరగలేదని అన్నారు. వారి ఆగడాలు మాత్రం ఇంకా సాగుతూనే ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య కళా నిలయంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ పునర్నిర్మాణం-ప్రజల పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి వలస పాలనలో వున్న తెలంగాణను ఆదుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు ప్యాకేజీలు, ప్రత్యేక ¬దా కల్పించడం దారుణమన్నారు. అయితే వారికి ఎలాంటి సాయం అందించినా తమకు అబ్యంతరం లేదని, కానీ నష్టపోయినా తెలంగౄణను విస్మరించడమే సహించలేమని అన్నారు. మలి దశ ఉద్యమంలో న్యూడెమోక్రసీ పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించటంలో కుట్ర జరిగిందని, దీనివల్ల పంపకాల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐకాస ఇప్పటికి ఒక మైలు మాత్రమే ప్రయాణించిందని, ఇంకా 99 మైళ్లు చేరుకోవాల్సి ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఐకాస ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు.పోలవరంలో మరిన్ని ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం అన్యాయమని కోదండరాం ధ్వజమెత్తారు. సీమాంధ్ర కార్పోరేట్‌ శక్తుల ఆగడాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. కేసీఆర్‌ దీక్ష, విద్యార్థుల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. పోలవరంపై తాము ఎప్పుడూ రాజీపడలేదని, ఇకముందు కూడా రాజీపడబోమన్నారు.