ఆకాశంలో సగం ఆమె..!!ఆమెకు సాటి లేరెవ్వరూ..

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
హైదరాబాద్‌, మార్చి 7 :ఆకాశంలో సగం ఆమె..ఆమెకు ఆమెయే సాటి.. ఆమెకు సాటి లేరెవ్వరూ.. అమ్మమ్మగా.. నాయనమ్మగా.. తల్లిగా.. అక్కగా.. చెల్లిగా.. భార్యగా..ఇలా అంతటా ఆమెనే. రాష్ట్రపతిగా.. ప్రధానిగా.. లోక్‌సభ స్పీకర్‌గా.. పార్టీ అధినేతగా.. ప్రతిపక్ష నేతగా.. బ్యాంకు ఛైర్మన్‌గా.. ఎంపీలుగా.. ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా.. గాయకురాలిగా.. నటీమణులుగా.. పారిశ్రామికవేత్తలుగా..ఉద్యోగినిగా.. రాజకీయ నేతగా.. శాస్త్రవేత్తగా.. అంతరిక్ష ప్రయాణికురాలిగా.. పైలెట్‌గా.. డ్రైవర్‌గా.. కండక్టర్‌గా.. గృహిణిగా ఇలా ఎక్కడ చూసినా ఆమెనే. మానవ జీవితంలో ఆదినుండి ఆద్యంతం వరకు ఆమె.. ఆమె లేని లోకం లేదు.. ఆమె లేని జీవితం లేదు.. కానీ ఆమెపై ఇటీవల ‘మరక’లు పడుతున్నాయి.. ఆమెను బాధపెడితే.. మానవాళి బాధపడుతుంది. అలా కాకుండా జాగ్రత్తపడదాం.. ఆమెను పూజిద్దాం.. ఆరాదిద్దాం..ఆమెతో జీవిద్దాం.. ఇదే సృష్ఠిధర్మం.. ఇదే శ్రేయస్కరం..శుభోదాయకం! శనివారం ప్రపంచ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం..

మహిళా ‘స్ఫూర్తి’

‘యంత్ర నార్యంతు పూజ్యంతు, రమంతే తత్ర దేవతా’.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నిలుస్తారు. వేదకాలంలో స్త్రీ పురుష భేదం అంతగా కనిపించదు. రాణిరుద్రమ, దుర్గావతి, చాంద్‌ బీబీ, పల్నాటి నాగమ్మ వంటి స్త్రీమూర్తులు రాజకీయంగా సమాజాన్ని ప్రభావితం చేశారు. భూమి తల్లి, గోమాత, గంగామాత, భారతమాత అన్నింటిలో మాతృమూర్తిని పూజించుకునే విశిష్ట లక్షణం మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. భారతీయ స్త్రీ ప్రపంచ స్త్రీలందరికీ ఆదర్శవాదిగా నిలుస్త్తోంది. రాజకీయ వేత్తలుగా, శాసనకర్తలుగా, శాస్త్రవేత్తలుగా, విమానచోదకులుగా, అంతరిక్షంలో వ్యోమగాములుగా, న్యాయవాదులుగా, వైద్యులుగా అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. అయితే, ఈ మార్పు సరిపోదు.. మహిళా లోకానికి చీకటి ఇంకా తొలగిపోలేదు. ఈ చీకట్లను తొలగించే దిశగా.. ఇటీవలీ కాలంలో మహిళాలోకానికి స్ఫూర్తినింపిన కొంతమంది ధీరవనితల గురించి తెలుసుకుందాం.. నేడు మహిళాలోకం స్ఫూర్తిదాయకంగా ఎదుగుతున్న మాట వాస్తవమే అయినా.. అది కొద్దిశాతం మాత్రమే. ఇప్పటికీ పురుషాధిక్యత సమాజంలో ఆడవారు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఆడవారు అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం అని జాతిపిత మహాత్మాగాంధీ పలికినా.. దేశాభివృద్ధిని ఆ దేశంలోని మహిళల పరిస్థితిని గమనించి తెలుసుకోవచ్చు అని జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నారు. నేటికీ ఆ కల, ఆశయాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పటికీ మహిళలు ధైర్యంగా రాత్రిపూట బయటికి ఒంటరిగా వెళ్ళలేరు. నేటికీ వివిధ రంగాలలో మహిళలు వెనకబడి ఉన్నారు.

మార్చి ఎనిమిది అంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మార్చి ఎనిమిదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీ. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కృతిక భేదభావాలకు తావులేకుండా మహిళలందరూ ఒకచోటచేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు. ప్రాచీన గ్రీకురాజ్యంలో లీసిస్టాటా పేరుగల మహిళ ఫ్రెంచి విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్శీ మహిళలతో కూడిన సమూహం ఒకటి ఇదే రోజు వెర్సెల్స్‌లో ఒక ఊరేగింపును నిర్వహించింది. యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్‌ చేస్తూ వారు ఊరేగింపు జరిపారు. 1909, ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్‌ పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో మహిళా దినోత్సవం జరిగింది. 1910లో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో లక్షలాది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ ర్యాలీలో పాలుపంచుకున్నారు. 1913-14 మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని స్థాపించాలని కోరుతూ ఫిబ్రవరి నెలాఖరు ఆదివారం రష్యా దేశపు మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐరోపా అంతటా యుద్ధ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. 1917 సంవత్సరం వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో రష్యాకు చెందిన రెండు లక్షలకుపైగా సైనికులు మరణించారు. ఆహారం, శాంతిని కోరుతూ ఇదే రోజున రష్యా మహిళలు హర్తాళ్‌ కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యమాలు, పోరాటాలతో రష్యా మహిళలు ఓటుహక్కును సాధించుకున్నారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతియేటా మార్చి 8న విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

పుట్టింది ఇలా..

ప్రపంచ వ్యాప్తంగా ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నిజానికి ఇది అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా చెప్పవచ్చు. అమెరికాలోని సోషలిస్టు పార్టీ మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో జర్మనీలోని కోపెన్‌హేగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చర్చించారు. 1911, మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాలలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.

అంతర్జాతీ మహిళా దినోత్సవం సందర్భంగా రష్యాలో జరిగిన ప్రదర్శనలను 1917లో జరిగిన రష్యన్‌ విప్లవానికి మొదటి దశగా చెప్పవచ్చు. నేడు మహిళా దినోత్సవం రూపురేఖలు మారిపోయాయి. వివిధ రంగాల్లో మహిళలను గౌరవించేందుకు, వారిని ప్రశంసించేందుకు, వారిపట్ల ప్రేమాభిమానాలను తెలియజేసేందుకు ఈ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినం ఏర్పడేందుకు కారణమైన శ్రామిక మహిళలు నేటి వేడుకల్లో తెర వెనక్కు వెళ్ళారు. కార్పొరేట్‌ మహిళలు ముందుకు వచ్చారు. నేడు మహిళా దినోత్సవం తన రంగు, రుచి, వాహనలను కోల్పోయింది. పోరాట స్వభావాన్ని వీడి ఓ సాధారణ పండుగలా మారిపోయింది. మదర్స్‌డే తరహాలోకి వెళ్ళిపోయింది.

ఆలోచనా సరళిని మార్చారు..

విద్యాధికులైనా, ఉద్యోగులైనా స్త్రీ వివక్షకు గురవుతూనే ఉంది.  ఇప్పుడు ఆధునిక వేధింపు ఏమిటంటే యాసిడ్‌ దాడులు. తన మాట వినకపోయినా, ప్రేమించకపోయినా యాసిడ్‌ పోసేయటమే. ఆ అమ్మాయికి ఇష్టాయిష్టాలు ఉంటాయని ఆలోచించరెందుకో. ఆకాశంలో సగం అని చెప్పుకోవడమే గానీ రాజకీయాలలో, ప్రాధాన్యత రంగాలలో స్త్రీల శాతం ఎంత ఉన్నది? అతి కొద్దిమంది మాత్రమే ఉన్నత పదవులలో ఉంటున్నారు. అన్నింటిలో వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. గత రెండు దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, పెంచిపోషిస్తున్న వినిమయ, వినోద సంస్కృతి మహిళలను కడగండ్లపాలు చేస్తున్నాయి.  ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా మహిళల మనుగడకు సవాల్‌ విసిరింది. ఇలాంటి దుర్ఘటనలు ప్రతిరోజు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు స్త్రీ అస్తిత్వానికే సవాల్‌గా పరిణమించాయి. అయితే, గతంతో పోల్చిచూస్తే ఇటీవలి కాలంలో స్త్రీలలో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. అందరిలోనూ వారి భద్రదపట్ల మరింత అవగాహన పెంచుకునే దిశగా మహిళలు ఆలోచనా సరళిని విస్తృతం చేసుకుంటున్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి గళం ఎత్తుతున్నారు. విద్యా, కార్పొరేట్‌ రంగాల్లో తమదైనశైలిలో మహిళాలోకం దూసుకుపోతోంది. అయితే, ఇది చాలదు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. నేడు ఎంతో మంది మహిళలు తమ తమ రంగాల్లో రాణిస్తున్నా.. వారి స్ఫూర్తితత్వం అన్ని వర్గాల మహిళలకు చేరడంలేదు. అలాంటి స్ఫూర్తిదాయక మహిళలు కొందరి గురించైనా చర్చించుకుందాం..

ఉగ్రవాదంపై బ్రహ్మాస్త్రం.. మలాలా..

అది 2007వ సంవత్సరం. స్వాత్‌ లోయలోని మింగోరా ప్రాంతం. ఆనాడు స్వాత్‌ అంతటా తాలిబన్ల ఇష్టారాజ్యమే. వారు ఏం ఆదేశిస్తే ప్రజలంతా కిక్కురుమనకుండా పాటించాల్సిందే! కార్లలో పాటలు వినకూడదు లాంటి అర్థంపర్థంలేని ఆదేశాలతో సహా తాలిబన్లు వారికేంతోస్తే అవే నిబంధనలు. ఆడపిల్లలు చదువుకోకూడదన్న మూర్ఖత్వపు నిబంధన తాలిబన్లు ఆ ప్రాంతమంతటా విధించారు. ఇది చదువంటే ప్రాణంగా భావించే మలాలా మనసును గాయపరిచింది. కేవలం ఆడపిల్లనైనంత మాత్రాన చదువుకు దూరంగా ఉండడం ఆమెను కలచివేసింది. 11 ఏళ్ళ వయసులో మలాలా అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. వాటిని వెలిబుచ్చడానికి మలాలా సోషల్‌ మీడియాను మార్గంగా చేసుకుంది. ‘గుల్‌ మకారు’ అనే కలం పేరుతో బిబిసి ఉర్దూలోని బ్లాగులో ముస్లిం దేశంలో ఆడపిల్లగా పుట్టినందుకు చదువుకోకూడదా అని ప్రశ్నించింది. ఈ వివక్ష పోవాలని గళంవిప్పింది. ముష్కరుల అక్రమాలు నశించాలంది. ఉగ్రవాదమే ఊపిరిగా బతుకుతున్న దుర్మార్గులు దీన్ని సహించలేకపోయారు. బలిబన్ల నుండి మలాలాకు బెదిరింపులు మొదలయ్యాయి. అయినా, మలాలా వెరవలేదు సరికదా మరికాస్త ధైర్యాన్ని పుంజుకుంది. తోటి విద్యార్థినులకు సైతం ధైర్యాన్ని నూరిపోసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చదువుకుని తీరాలని పదే పదే చెప్పింది. స్వాత్‌ ప్రాంతమంతా ప్రతికూల పరిస్థితులే. అలాంటి సమయంలో విద్యకోసం, ప్రపంచంలో శాంతి నిండాలనే ఆకాంక్షకు బాసటగా నిలిచిన మలాలా పేరు దేశమంతటా మారుమోగింది. మలాలా అకుంఠిత దీక్షకు అచ్చెరువొందిన ప్రభుత్వం పోయిన సంవత్సరం మలాలాకు ‘జాతీయ యువజన శాంతి పురస్కారం’ అందించింది. ఈ అవార్డు తొలిగ్రహీత మలాలానే కావడం విశేషం. అంతేకాదు, అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి మలాలా ఎంపికైంది. ఇవన్నీ ఉగ్రవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయి. మొక్కే కదా అని వదిలేస్తే ఉగ్రవాదాన్ని పెకిలించే వృక్షం కావచ్చని భయపడ్డారో ఏమో మలాలాను హతమార్చాలని పన్నాగం పన్నారు. అక్టోబర్‌ 9, 2012న స్వాత్‌ లోయలోని మింగోరా పట్టణంలో స్కూల్‌ బస్సులో ఉన్న మలాలాపై దాడిచేశారు. అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. మలాలా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకరంగా ఉన్న మలాలాను వెంటనే స్థానిక వైద్యశాలలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విమానం ద్వారా పెషావర్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. మలాలా యూసుఫ్‌జాయ్‌ శరీరంలోంచి వైద్యులు ఒక తూటాను తొలగించారు. మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి వెన్నుపూస పక్కన దిగిన తూటాను తీశారు. అయినా, మలాలా పరిస్థితి నిలకడగా లేదు. తర్వాత మెరుగైన వైద్యంకోసం ఇంగ్లాండ్‌ పంపించిన తర్వాత మలాలా మెల్లిగా కోలుకుంది. మలాలా యూసుఫ్‌జాయ్‌ ముష్కరుల బెదిరింపులను ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకు నడిచిన ధీశాలి. నేటి తరానికి ప్రతీక. ఉగ్రవాద చర్యలను వ్యతిరేకించిన ధైర్యస్తురాలు. తాలిబన్ల ఆరాచకాలను ఎలుగెత్తిచాటిన సాహసి. హక్కుల కోసం పోరాడిన ఉత్తమ కార్యకర్త. సామాన్య ప్రజల గుండెల్లో కొలువుదీరిన విప్లవజ్వాల. స్త్రీలోకానికి స్ఫూర్తి నింపిన రేపటి మహిళ. ఆమె చూపిన సాహసం ప్రపంచానికే స్ఫూర్తినింపింది. ఎన్నో పురస్కారాలు, బహుమానాలు వెల్తువెత్తాయి. అమెరికా ప్రభుత్వం మలాలా పేరిట వేతన చట్టాన్ని ప్రవేశపెట్టింది. నోబెల్‌శాంతి పురస్కారానికి కూడా ఎంపికైంది.

క్రీడాస్ఫూర్తి.. సైనా నెహ్వాల్‌..

క్రీడారంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేరు సైనా నెహ్వాల్‌. భారత మహిళా బ్యాడ్మింటన్‌కు విశ్వఖ్యాతినార్జించిన తొలి మహిళ ఎవరంటే.. సైనా పేరు చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహిళా క్రీడాలోకానికి ఆమె స్ఫూర్తిదాయక మహిళ. చిన్నతనంలోనే సైనాలోని ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి.. ప్రతిరోజూ 50 కిలోమీటర్లు ప్రయాణించి సైనాకు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పించారు. దాంతో ఆమె ప్రతిభ వెలుగుచూసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలో రెండవ ర్యాంక్‌ క్రీడాకారిణిగా ఎదిగిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పేరుగడించింది.

మరో శాంతి కుసుమం.. ఇలాభట్‌..

భారతీయ మహిళాలోకం గర్వపడే ‘శాంతి’ కుసుమం ఇలాభట్‌. రాష్ట్రపతి చేతుల మీదుగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్న ధీరవనిత ఇలాభట్‌. సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (సేవా) సంస్థ స్థాపించి సమగ్ర మహిళా సాధికారతక కోసం కృషి చేసినందుకు, జీవిత విజయాల పరంపరకుగాను ఈ శాంతి పురస్కారాన్ని అందజేసింది భారత ప్రభుత్వం. అలహాబాద్‌లో పుట్టిన భట్‌ బిఎ, న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. 1954లో న్యాయశాస్త్రంలో పట్టాతో పాటు హిందూలాలో ఆమె చేసిన కృషికి బంగారు పతకాన్ని పొందింది. ముంబయిలోని ఎస్‌ఎన్‌డిటి మహిళా కళాశాలలో కొంతకాలం ఇంగ్లీష్‌ అధ్యాపకురాలిగా పనిచేసి, 1955లో అహ్మదాబాద్‌లోని టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ (టిఎల్‌ఎ)లో లీగల్‌ విభాగంలో చేరింది. 1956లో భట్‌ రమేష్‌ భట్‌ని వివాహం చేసుకుంది. గుజరాత్‌ ప్రభుత్వంతో కొంతకాలం పనిచేసిన తర్వాత ఇలా రమేష్‌ భట్‌ టిఎల్‌ఎ ద్వారా 1968లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈమె యూరో ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో లేబర్‌ అండ్‌ కోఆపరేటివ్‌ గురించి చదవడం కోసం మూడు నెలల ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవివ్‌కు వెళ్ళింది. ఇందులో ఈమె 1971లో అంతర్జాతీయ డిప్లమా సాధించింది. భట్‌ ఇక్కడ పనిచేస్తున్న సమయంలో వేలమంది మహిళలు కుటుంబ అవసరాల కోసం రోజుకూలీ వేతనాలకి పనిచేస్తూ ఉండడం, వారికి ఏ విధమైన రక్షణ లేకపోవడం వంటి విషయాలు చాలా ప్రభావితం చేశాయి. ఇక్కడ ఉద్యోగినులకు తప్ప మిగిలిన వారు స్వయం ఉపాధి కోసం పనిచేస్తున్న వారే. దాంతో భట్‌, టిఎల్‌ఎలో పనిచేస్తున్న అరవింద్‌ సహకారంతో 1972లో సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ని స్థాపించి అధ్యక్షపీఠంపై అరవింద్‌ని కూర్చుండబెట్టి, తాను జనరల్‌ సెక్రటరీగా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ ద్వారా అనేక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా 1979లో ఈస్థర్‌ ఒక్లూ, మిచిలా వాష్‌లతో కలిసి ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంక్‌ని స్థాపించింది. 1980 నుంచి 1988 వరకు దానికి అధ్యక్షురాలిగా  సేవలందించింది. భట్‌ సేవా కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షురాలిగా కూడా చిల్లర దుకాణదారులకు, గృహ పరిశ్రమలు నడిపే వారికి  చేయూతనిచ్చింది.

ఈ నేపథ్యంలో ఎన్నో పురస్కారాలను అందుకుంటూ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ, 1986లో పద్మభూషణ్‌ ఇచ్చి గౌరవించింది. 1977లో జాతి నాయకురాలిగా గుర్తించి రామన్‌ మెగాసెస్‌ అవార్డుని ప్రదానం చేశారు. 1984లో రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు కూడా తన సొంతం చేసుకుంది. పేద మహిళల సాధికారత కోసం ఈమె చేసిన కృషికి 2010లో నినానో శాంతి పురస్కారానికి ఎంపిక చేశారు. అమెరికా ప్రభుత్వం.. భారతదేశంలో కొన్ని లక్షల మంది పేద మహిళలకు చేసిన సహకారాన్ని, వారికి ఒకస్థాయిని కల్పించడానికి చేసిన కృషిని గుర్తించి గ్లోబల్‌ ఫెయిర్‌నెస్‌ ఇనీషియేటివ్‌ అవార్డుతో ఇలాభట్‌ని సత్కరించింది. ఈ విధంగా తనవంతు సేవలలో నిమగ్నమైన పనిచేస్తున్న భట్‌కు, ఈమె మహిళా అభ్యున్నతికి చేసిన సేవలకుగాను 2011, మే 27న అత్యంత ప్రతిష్టాత్మకమైన రాడ్‌క్లిఫ్‌ పతకంతో సత్కరించారు. 2011, నవంబర్‌లో ఇలాభట్‌ని మహిళా సాధికారత, శాంతి నిరాయుధీకరణ, అభివృద్ధి రంగాల్లో కృషి చేసినందుకుగాను ఇందిరాగాంధీ బహుమతికి ఎంపిక చేశారు.

ఎందరెందరో..

భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలిగా సిరిమావో బండారు నాయకె అత్యుత్తమ సేవలందించి చరిత్రలో చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. భారత రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌, లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌, యుపిఎ చైర్‌పర్సన్‌గా, కాంగ్రెస్‌పార్టీ అధినేత్రిగా సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మాస్వరాజ్‌, సీపీఎం పార్టీ ప్రతినిధిగా బృందాకారంత్‌, ఎంపీలుగా.. కేంద్ర మంత్రులుగా పురందరేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లీ కృపారాణి, జయప్రద, హేమామాలిని, జయభాదురి, ఎమ్మెల్సీగా నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలుగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, గల్లా అరుణ, ప్రముఖ గాయకులుగా పి.సుశీల, ఎస్‌. జానకి, వాణీజయరాం, ఎల్‌ఆర్‌ ఈశ్వరి, జిక్కీ, జమునారాణి, లతా మంగేష్కర్‌, ఆశాభోంస్లే, భానుమతి, సావిత్రి, జమున, సూర్యకాంతం,.. ఇలా ఎందరెందరో తమ తమ పదవుల్లోనూ.. కళాకారులుగా.. వివిధ వృత్తుల్లో కొనసాగుతూ.. ఎదుగుతూ.. ఒదిగి ఉంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికి శుభాభివందనాలు!!