తెలంగాణపై స్టేకు సుప్రీం నిరాకరణ
కేంద్రానికి నోటీసులు
చేజారిన చివరి అవకాశం
డీలా పడ్డ సమైక్యవాదులు
న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆంధప్రదేశ్ విభజనను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు గడప తొక్కిన వారికి మరోమారు చేదు అనుభవం ఎదురయ్యింది. విభజనపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. అయితే విభజనను అడ్డుకునేందుకు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో వారికి నిరాశ తప్పలేదు. అయితే ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో విభజనపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనతో విభేదించింది. దీంతో తెలంగాణ బిల్లుకు న్యాయపరంగా అడ్డంకులు తొలిగాయి. విభజనపై నివేదిక ఇవ్వాలని కేంద్రానికి, ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 2 కంటే ముందే నిర్ణయించాలన్న అభ్యర్థనను కోర్టు ఈ సందర్భంగా తోసిపుచ్చింది. విభజనపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. విభజనపై స్టే ఇవ్వాలని న్యాయవాదులు కోరితే, స్టే ఇవ్వలేమని కోర్టు తిరస్కరించింది. రాష్ట్ర విభజనపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా పదిహేడు మంది వరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. విభజన సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని, 371డీ సవరణ చేయకుండా ఎలా విభజిస్తారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను హెచ్‌ఎల్ దత్తు ధర్మాసనం విచారిస్తోంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో విభజనపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. విభజన పిటీషన్లపై విచారణను ముగించి తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు పంపింది. విభజనపై రాజ్యాంగ పరంగా విచారణ జరపాలని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.