మహబూబ్‌నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా
శ్రీనివాస్‌గౌడ్
మరి ఇబ్రహీం మాటేమిటి?
పునర్నిర్మాణమంటే ముస్లింలపై మట్టికప్పడమా?
మండిపడుతున్న మైనార్టీ పెద్దలు
హైదరాబాద్, మార్చి 8 (జనంసాక్షి) :
తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు. శనివారం టీజీవో నేతలతో కలిసి కేసీఆర్‌తో భేటీ అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్ సీటిస్తే అక్కడ పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన మైనార్టీ నేత ఇబ్రహీం పరిస్థితి ఏమిటని మైనార్టీ వర్గాలకు చెందిన వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తమ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ ప్రాంత పునర్నిర్మాణమూ సాధ్యమంటున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ పేరుతో ముస్లిం మైనార్టీల రాజకీయ అస్తిత్వంపై మట్టి కప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న ముస్లింలను విస్మరిస్తూనే వస్తోంది. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుబెట్టుకొని 46 స్థానాలకు పోటీ చేసిన టీఆర్‌ఎస్ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా ముస్లింలకు కేటాయించలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో పాతబస్తీకి చెందిన మైనార్టీ నాయకుడు రహమాన్‌ను ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి పంపారు. దురదృష్టవశాత్తు ఆయనకు డ్రాలో రెండేళ్ల పదవీకాలమే దక్కడంతో ఆ పదవీ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తర్వాత రహమాన్ కేసీఆర్‌తో విభేదించి పార్టీని వీడారు. 2009లో మహాకూటమిలో భాగంగా 56 శాసనసభ, పది పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టీఆర్‌ఎస్ కేవలం ఒక్క మహబూబ్‌నగర్‌లోనే మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ ఇబ్రహీంకు టికెట్ ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో కేవలం ఐదు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిచెందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి అకాల మరణంతో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. మహబూబ్‌నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీ జేఏసీ ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా స్తబ్దంగా ఉండిపోయింది. ఉప ఎన్నికల్లో సీటు ఆశించిన శ్రీనివాస్‌గౌడ్ మళ్లీ ఇబ్రహీంకే టికెట్ ఇవ్వడంతో కేసీఆర్‌పై అలక వహించి బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు సహకరించినట్లుగా ఆరోపణలున్నాయి. జేఏసీ టీఆర్‌ఎస్ అభ్యర్థికి సహకరించకపోయిన కేవలం 1400 ఓట్లతోనే ఇబ్రహం మళ్లీ ఓడిపోయారు. టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిన ఏకైక స్థానంలో మైనార్టీ అభ్యర్థి గెలుపునకు అంతగా పాటు పడలేదనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీం గెలుపునకు అక్కడి పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇబ్రహీం కూడా కాలికి బలపం కట్టకుండా తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతను ఆ స్థానంలో నిలపడంపై మైనార్టీ పెద్దలు మండిపడుతున్నారు. ఇబ్రహీంకే మహబూబ్‌నగర్ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు సోమవారం ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు టీజీవో సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కమల్‌నాథ్ కమిటీ ద్వారా ఎక్కడి ఉద్యోగులు అక్కడే ఉండాలని చెప్పడం మమ్ములను బాధించిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యోగులను వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై పోరాటం చేస్తామని అన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని అన్నారు. టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోరిక మేరకు ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మహబూబ్‌నగర్ శాసనసభ స్థానానికి పోటీ చేయాల్సిందిగా ఆయన కోరినట్లు తెలిపారు. సోమవారం ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. తాను కూడా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకు కేసీఆర్ సరేనని అన్నారని చెప్పారు.