పీసీసీ చీఫ్‌లు ఖరారు!
తెలంగాణకు జానారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు బొత్స
న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత చీఫ్ బొత్స సత్యనారాయణనే కొనసాగించబోతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అధిష్టానంపై ఒత్తిడిపెంచడంతో పాటు పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన జానారెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అధిష్టానానికి లేఖ రాశారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌ల రేసులో జానారెడ్డితో పాటు మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి పోటీపడ్డారు. ఒక దశలో కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి పేరు కూడా వినిపించింది. మాజీ డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను పీసీసీ చీఫ్, సీఎం రేసులో లేనని జైపాల్‌రెడ్డి శనివారమే తేల్చిచెప్పారు. మరోవైపు సీఎం కుర్చీపైనే కన్నేసిన దామోదర, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు తుది దశలో ప్రయత్నాలను విరమించుకున్నట్లు తెలిసింది. పార్టీని ఏకతాటిపై నడిపే సీనియర్‌గా జానారెడ్డికి పేరుండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మరోవైపు శనివారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని తెలంగాణ, సీమాంధ్రకు చెందిన నేతలు కలిశారు. తమకు అవకాశం కల్పించాలని వారు రాహుల్‌ను అభ్యర్థించినట్లుగా సమాచారం. రాహుల్‌ను కలిసిన వారిలో దామోదర రాజనర్సింహ, డి. శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, సీమాంధ్ర నుంచి రఘువీరారెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. సీమాంధ్రలో పీసీసీ చీఫ్ పదవిని మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, చిరంజీవి, పళ్లంరాజు ఆశించినట్లు ప్రచారం జరిగినా అధిష్టానం కీలకమైన సమయంలో పార్టీతోనే ఉన్న బొత్సకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈమేరకు నియామక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది.