భూకంప కేంద్రంలో పోలవరం

తేడా వస్తే మూడు జిల్లాలు మటాష్‌
గీ ముచ్చట ఆంధ్ర ఇంజినీరే చెప్పిండు
ముంపుగ్రామాల ఆర్డినెన్స్‌ రాష్ట్రపతి ఆమోదించలేదు
నీళ్లిస్తం.. ప్రాజెక్టు అక్కడొద్దు
ప్రతి జర్నలిస్టుకు డబుల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్‌
తెలంగాణ పోరులో జర్నలిస్టుల పాత్ర అమోఘం
జర్నలిస్టు జాతరలో కేసీఆర్‌
హైదరాబాద్‌, మార్చి 9 (జనంసాక్షి) :
భూకంప కేంద్రంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ విషయం గూగుల్‌లో క్లిక్‌ చేస్తే తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర నేతలకు తెలిసికూడా పట్టుబట్టి అక్కడే పోలవరం నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించారని, ప్రాజెక్టు నిర్మాణం వల్ల అక్కడ ఒత్తిడి పెరిగి జరగరానిదేదైనా జరిగితే మూడు జిల్లాలు మటాష్‌ అయితాయని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఒకరు చెప్పిండ్రని అన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టు జాతరలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ఎంతగా ప్రయత్నించి సీమాంధ్రులు కేంద్రంపై ఒత్తిడి చేసి పోలవరం నిర్మాణాన్ని ఖాయం చేసుకున్నారని చెప్పారు. అయితే వారు కోరినట్లుగా ఏడు మండలాలు కాకుండా ముంపునకు గురవుతున్న గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో కలుపుతున్నారని తెలిపారు. అయితే ప్రాజెక్టు నిర్మాణ స్థలం మాత్రం సరైనది కాదని అన్నారు. సీమాంధ్రకు నీళ్లు ఇస్తామని, ప్రాజెక్టును మాత్రం అక్కడ కట్టొద్దని కోరారు. టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తర్వాత భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించలేదని చెప్పారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్రం అమోఘమని, జర్నలిస్టుల త్యాగాలను ఎంతగా చెప్పినా తక్కువేనని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. నిబద్ధత, ధైర్యం, మొండి పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. మనం ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు మనం పొరుగు రాష్ట్రమైన సీమాంధ్రుల గురించి గానీ మరెవరి గురించిగానీ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. మనం ఇప్పుడు పేదరికంపై పోరాటం చేయాల్సి ఉందన్నారు. వందేళ్లుగా మనం ఎన్నో బాధలు అనుభవించామని గుర్తు చేశారు. ఉద్యమ ఆరంభంలో తాను ఒంటరిగానే పోరాటం చేశానని, ఇప్పుడు పేదరికంపైనా పోరాటం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని అన్నారు. మీడియాలో ఏ విభాగంలో పనిచేసే వారైన జర్నలిస్టులేనని ఆయన చెప్పారు. కెమెరా జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, డెస్క్‌ జర్నలిస్టులు ఎవరైనా పత్రికల ప్రచురణలో, చానెళ్ల నిర్వహణలో భాగమేనని వాళ్లందరికీ రావాల్సిన రాయితీలు కల్పించి తీరుతామన్నారు. జర్నలిస్టులందరికీ రెండు బెడ్రూములతో కూడిన ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని అన్నారు. మండల స్థాయి నుంచి హైదరాబాద్‌ వరకు పనిచేసే అందరికీ అక్రెడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇప్పిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టులపై సీమాంధ్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఒక్క సంతకం ఎత్తివేయిస్తానని అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌కు అధునాతన హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర మీడియా ఇప్పటికీ విష ప్రచారాన్ని మానుకోవడం లేదని, అబద్ధాలు రాస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభలో తెలంగాణకు పరిశ్రమలు రావడం లేదని, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌ నుంచి సీమాంధ్రకు పోయే అవకాశం ఉందని అబద్ధాలు రాశారని మండిపడ్డారు. తాను ఈ కథనం సమాచారాన్ని పరిశీలిస్తే అదంతా అబద్ధమని తేలిందన్నారు. సీమాంధ్ర పత్రికల విష ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత తెలంగాణ మీడియాపై ఉందని అన్నారు. సీమాంధ్ర మీడియాల్లోగాని, సినిమాల్లోగాని తెలంగాణ యాసను కించపరిస్తే ఊరుకోబోమని కేసీఆర్‌ హెచ్చరించారు. సీమాంధ్రులకు తెలియకుండానే తెలుగు భాషలోని ఉర్దూ పదాలను వాడుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత తెలంగాణ బిల్లులో లోపాలున్నాయని, త్వరలో ఏర్పడే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కించుకుంటామని అన్నారు. 57 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సర్వం కోల్పోయిందని, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు మినహా తెలంగాణ వెనుకబడ్డాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఐటీఐఆర్‌ను స్వాగతిస్తున్నామని, దీని ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, అంతే సంఖ్యలో ప్రజలు పరోక్షంగా ఉపాధి పొందుతారని చెప్పారు. అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేవవరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో కె. రామచంద్రమూర్తి, టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, అద్దంకి దయాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కత్తి వెంకటస్వామి, దేశపతి శ్రీనివాస్‌, రసమయి బాలకిషన్‌, శైలేశ్‌రెడ్డి, ఎం.ఎం. రహమాన్‌, కట్టా శేఖర్‌రెడ్డి, సీఎల్‌ రాజం, కె. శ్రీనివాస్‌, టంకశాల అశోక్‌, విఠల్‌, వేదకుమార్‌, విమలక్క, ఘంటా చక్రపాణి, ఎన్‌. శంకర్‌, ఎన్‌. వేణుగోపాల్‌, క్రాంతి, రమణ, సోగరాబేగం. పల్లె రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.