మోగిన మరో నగారా

ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఏప్రిల్‌ 6న పోలింగ్‌
8న ఓట్ల లెక్కింపు : రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) :
జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి, నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి షెడ్యూల్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేదశలో బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్రొన్నారు. ఈ నెల 17 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 20న ముగుస్తుందని తెలిపారు. 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ మార్చి 24. ఏప్రిల్‌ 6న ఎన్నికల పోలింగ్‌. ఏప్రిల్‌ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అవసరమైతే 7న రీపోలింగ్‌ జరుపతామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇప్పుడు సమస్య వచ్చిపడిందన్నారు. తాము ఎన్నికలు నిర్వహించాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న తరుణంలో ఇబ్బంది పడాల్ల్సి వచ్చేది కాదన్నారు. ఇకపోతే ఎన్నికల ఫలితాల విడుదలపై మమ్మల్ని ఎవరూ ఆదేశించలేదన్నారు.. ఒకవేళ కోర్టులు ఆదేశిస్తే పాటిస్తాం. ఎన్నికలు నిర్వహించకపోతే ఇబ్బందులు వస్తాయని ఎప్పుడో చెప్పాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ప్రభుత్వం తీరువల్లే ఎన్నికల గందరగోళం ఏర్పడింది. రిజర్వేషన్‌ సమయానికి అంది ఉంటే ఇంత గందరగోళం జరిగేది కాదని విూడియాకు వివరించారు. గత ఏడాదే ఎన్నికలు నిర్వహించి ఉంటే ఇప్పుడు పార్టీలకు, సిబ్బందికి, ఇబ్బందులు ఉండేవి కావు. స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలంటూ పార్టీలు కోరాయి. 324 ఆర్టికల్‌ ప్రకారం రాజ్యంగంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు జరిగింది. ఎన్నికలు జరపటంలో మాకు, సీఈసీకి సమాన అధికారులు ఉన్నాయి. మా అధికారంలో సీఈసీ జోక్యం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సాధారణ ఎన్నికలు, పురపాలక ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ తమకు ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీజీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నిసార్లు చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించినట్లయితేఈ పర్‌థసితి తలెత్తేది కాదన్నారు. ప్రస్తుత గందరగోళ పర్‌థసితికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం వల్ల జిల్లా యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు ఎన్నికలు ఉంటాయన్నారు. పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తుపై ఎన్నికలు ఉంటాయన్నారు. 7న అవసరాన్ని బట్టి రీపోలింగ్‌, 8న ఫలితాలు ఉంటాయన్నారు. ఎన్నికల రిజర్వేషన్‌కు సంబంధించి ప్రభుత్వం వివరాలు పంపించినందున తాము నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు లేవు కాబట్టి తాము బ్యాలెట్‌ బాక్సులు వాడుతామన్నారు. 22 జిల్లాలకు పరోక్ష జిల్లా పరిషత్‌ ఎన్నికలు, 1096 మండల పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 17 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 21న పరిశీలిస్తామని చెప్పారు. 24న ఉపసంహరణ ఉంటుందన్నారు. 22 జిల్లా పరిషత్‌లకు అధికారులను నియమించినట్లు చెప్పారు. ఇందుకు అవసరమైతే కర్నాటక, తమిళనాడు సాయాన్ని తీకుంటామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి శనివారం రాత్రి ఎన్నికల సంఘానికి అందచేయడంతో.. ఎన్నికల నిర్వహణపై ఆదివారం ఎన్నికల సంఘం పూర్తి కసరత్తు చేసింది. షెడ్యూలును, సుప్రీంకోర్టుకు నివేదించే అఫిడవిట్‌ను సిద్ధంచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పి.రమాకాంతరెడ్డి, ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ సహా ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం విధుల్లో పాలుపంచుకున్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి ఎంపీడీఓల వరకూ అధికార యంత్రాంగమంతా సాధారణ ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ తమకు సమస్యగా మారనుందని అధికారులు సుప్రీంకోర్టుకు నివేదించనున్నారు. మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణ సమయంలోనే రాష్ట్రంవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కూడా జరుగుతుంటాయని, వేలమంది ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో నిమగ్నమై ఉంటారని, ఇది కూడా సమస్యేనని, ఎన్నికల సిబ్బందికి కొరత ఏర్పడొచ్చని కోర్టు దృష్టికి తెస్తారు. ఎంపీడీఓలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు బాధ్యతలు, ఎన్నికల వ్యయ పరిశీలన బాధ్యతలు చూస్తున్నారని, పురపాలక సంఘాల ఎన్నికలు విధుల్లో ఉన్నారని కోర్టుకు నివేదిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎంపీడీఓలు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరుతారు.