ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదు

కేసీఆర్‌ ప్రతిపాదనను తోసిపుచ్చిన కోదండరామ్‌

హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) :

ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మంగళవారం రాత్రి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కోదండరామ్‌, టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ చేసిన ప్రతిపాదనను ఆయన నిద్వంద్వంగా తోసిపుచ్చారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గానీ, వరంగల్‌ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి గానీ పోటీ చేయాలని కేసీఆర్‌ కోదండరామ్‌కు సూచించారు. ఉద్యమ నాయకుడిగా ఉంటానే తప్ప రాజకీయ నాయకుడిగా మారబోనని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ జేఏసీలో కీలకపాత్ర పోషించి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంలో కేసీఆర్‌ను కోదండరామ్‌ కోరారు. ఇదిలా ఉండగా, కోదండరామ్‌ను దాదాపుగా అన్నిపార్టీలు ఆహ్వానించాయి. భారతీయ జనతాపార్టీ రాజ్యసభ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ సైతం ఆయన ఎక్కడ కోరితే అక్కడ ఎంపీ సీటు ఇస్తామని కోదండరామ్‌ ముందు ప్రతిపాదనలు ఉంచారు. వీటిని కూడా కోదండరామ్‌ తోసిపుచ్చారు. టీ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ కీలక భూమిక వహిస్తుందని, ఇందుకోసం అందరితో కలిసి ముందుకు నడుస్తానని కోదండరామ్‌ పేర్కొన్నారు.