సమైక్యం కోసమే సీఎం పదవి త్యాగం చేశా

25 మందిని గెలిపియ్యండి

గట్టిగా పోరాడుతా : రాజమండ్రి సభలో కిరణ్‌

రాజమండ్రి, మార్చి 12 (జనంసాక్షి) :

సమైక్య రాష్ట్రం కోసమే ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశానని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు పెద్దమ్మ, చిన్నమ్మలు కారణమైతే ఇద్దరు బాబులు లేఖలు ఇచ్చి తోడ్పడ్డారని కిరణ్‌ మండిపడ్డారు. పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌ అయితే ఆ బాబులు మన చంద్రబాబు, జగన్‌ అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన పార్టీ తొలి బహిరంగ సభలో కిరణ్‌ మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. తమను కాదనుకుని కిరాయి వాళ్లను నమ్ముకుని కాంగ్రెస్‌ నమ్ముకుందని మండిపడ్డారు. అందుకే నమ్ముకున్న కేసీఆర్‌ పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంట్‌ సీట్లు గెలిపిస్తే విభభజనకు వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. గోదావరి దెబ్బ చూపాలని అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్‌కుమార్‌రెడ్డి పెద్దగా ఆకర్షించే ప్రయత్నం చేయలేకపోయినా చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పారు. కాంగ్రెస్‌, భాజపా, వైకాపా, తెదేపా అందరూ విభజనకు బాధ్యులేనని ఆరోపించారు. ఎవరు సిఫార్సు చేశారని రాష్ట్రాన్ని విభజించారని కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఈ రీతిలో విభజించడం సమంజసమా? అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర, తెలంగాణలో విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తాయని అన్నారు. తెలుగు జాతి విడిపోయిందన్న బాధ ప్రతిఒక్కరిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్‌ పార్టీకి తెలియదని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో రైతులు, మహిళలకు పావలా వడ్డీ, పెట్టుబడి రాయితీ ఇచ్చానని తెలిపారు. రాష్ట్రంలో ఓ పక్క తెలంగాణ ఉద్యమం, సకలజనుల సమ్మె, రైల్‌రోకోలాంటి ఆందోళన కార్యక్రమాలు నడుస్తున్నా.. అభివృద్ధి సాధించానని వెల్లడించారు. కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ ఒక పిచ్చి మేథావి అని మండిపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు ఇంకా చాలా నష్టం జరగబోతోందని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని.. అందుకే రాజీనామా చేశానని పేర్కొన్నారు. పదవి కోసం కొత్త పార్టీ పెట్టలేదని చెప్పారు. ఆలస్యంగా పార్టీ పెట్టారని అంటున్నారని. మీరు తలచుకుంటే ఈ 60 రోజుల్లో అసాధ్యమేదీ లేదన్నారు. అందరూ తలచుకుంటే జై సమైక్యాంధ్రకు మద్దతు దక్కుతుందని అన్నారు. తెలంగాణకు మద్దతు ఇచ్చి లేఖలు ఇచ్చిన టిడిపి, వైకాపాలను నమ్మవద్దన్నారు. అసెంబ్లీలో కనీసం కలసి ఉండాలని చెప్పలేకపోయిన చంద్రబాబు సింగపూర్‌ చేస్తానని అనడం దారుణమన్నారు. సమైక్యంగా ఉంచాలని కోరుతుంటే సింగపూర్‌ కావాలా అని ప్రశ్నించారు. రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్‌ను, పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌ను అధికారం కోసం ద్రోమం చేసిన వ్యక్తి బాబు అని అన్నారు. ఇక ఆర్టికల్‌ 3 ప్రకారం విభజన చేసుకోమన్న వ్యక్తి జగన్‌ అని అన్నారు. కేవలం సీఎం పదవి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి జగన్‌ అని అన్నారు. ఇలాంటి వారు కావాలో ప్రజల కోసంపదవిని త్యాగం చేసిన జై సమైక్యాంధ్ర కావాలో తేల్చుకోవాలన్నారు. 25 మందిని గెలిపిస్తే పోరాడుతామన్నారు. ఇక్కడ బీ ఫారాలు ఇచ్చేది ప్రజలేనన్నారు. బుల్లెట్‌ లాంటి వ్యక్తులను ఎన్నికల్లో నిలబెడుతామన్నారు.