ముంబైలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం


ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

ముంబై, మార్చి 14 (జనంసాక్షి) :

ముంబైలో మరో భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ముంబైలోని వకోలా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఏడంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ భవనం ఖాళీగా ఉన్నట్లు రికార్డుల్లో ఉన్న సమీపంలోని మురికివాడలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇందులో నివసిస్తున్నట్లు సమాచారం. దీంతో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం గాలిస్తున్నారు. బృహాన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీహెచ్‌సీ) పరిధిలోని ఈ భవనం ఖాళీగా ఉందని అధికారులు వెల్లడించారు. భవనం పక్కన మురికి వాడలు ఉన్నందున శిథిలాల్లో పలువురు చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బీహెచ్‌సీ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు, అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి శిథిలాలు తొలగిస్తున్నాయి. శిథిలాల కింది నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన మురికివాడల్లోని ప్రజలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.