మా మేనిఫెస్టో ప్రజల పక్షం
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చీఫ్ శ్రీధర్‌బాబు
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి : కోదండరామ్
హైదరాబాద్, మార్చి 16
(జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తమ మేనిఫెస్టోలో ప్రతిఫలిస్తాయని తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చీఫ్, మాజీ మంత్రి డి. శ్రీధర్‌బాబు అన్నారు. ఆరు దశాబ్దాల వలస పాలనలో ఎన్నో అన్యాయాలను ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తమకు తెలుసునని, వారికి మంచిచేసేలాగే తాము మేనిఫెస్టో రూపొందిస్తున్నామని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అణగారిన, దళిత, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. ఆదివారం తెలంగాణ మేనిఫెస్టో కమిటీ గాంధీభవన్‌లో భేటీ అయింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి గట్టి పునాదులు వేసేలా ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ మేనిఫెస్టో కమిటీతో రాజకీయ జేఏసీ నేతల భేటీ ముగిసింది. టీ జేఏసీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని ఈ సందర్భంగా టీ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెలిపారు. తాము రూపొందించిన సాధారణ ప్రణాళిక ఆధారంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి కొన్ని సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్తూపాలు నిర్మించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులన్నీ బేషరుతుగా ఎత్తివేయాలని అన్నారు. ఈ బేటీలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, టీ జేఏసీ నేత రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.