దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణే
బడుగుల కన్నీళ్లు తుడిచేందుకే పునర్నిర్మాణం : కేసీఆర్
పునర్నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యం : కొండా సురేఖ
టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా దంపతులు
హైదరాబాద్, మార్చి 18 (జనంసాక్షి) :
దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణే నిర్మిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. బడుగుల కన్నీళ్లు తుడవ డమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చా రు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్‌ఎస్ మాత్రమే పరిష్కరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు ఉన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్నీ తెలిసిన పార్టీ కేవలం టీఆ ర్‌ఎస్ మాత్రమేనన్నారు. తమ 14 ఏళ్ల ఉద్యమంలో ఇవన్నీ చూశా మని అన్నారు. మంగళవారం సాయంత్రం వరంగల్ జిల్లాకు చెంది న కీలక నాయకులు కొండా సురేఖ, మురళీధర్‌రావు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సమస్యలు, వాళ్లు ఏం కోరుకుంటున్నారో కూడా టీఆర్‌ఎస్‌కే తెలుసునని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ దంపతులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల బాధలు అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదన్నారు. తెలం గాణలో 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనన్నారు. తెరాస నాయకత్వంలో బలహీన వర్గాలు, పేద ప్రజలకు 125 గజాల స్థలంలో రూ.2 లక్షల 75 వేల కోట్ల ఖర్చుతో వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. నిర్బంధ విద్య అమలుచేస్తామ న్నారు. బడిఈడు పిల్లలందరినీ బడికి పంపిస్తామన్నారు. తెలంగాణ లోని అన్ని కులాల, మతాల బిడ్డలకు విశాలమైన ప్రాంగణంలో హాస్టళ్లు నిర్మిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పిల్లల తిండి, చదువు, బట్టలు, పుస్తకాలు అన్ని ప్రభుత్వమే భరించేలా చూస్తామన్నారు. టీఆర్‌ఎస్ రాక ముందు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి అన్యాయం జరిగిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ వచ్చాకే ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని వెల్లడించారు. పేదల బతుకుల్లో నవ్వులు నింపేందుకే తెలంగాణ వచ్చిందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధిద్దాం, తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలవారు ఆత్మగౌరవంతో బతికేలా ప్రణాళికలు రూపొందించుకుందామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతో పాటు రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటేనే ఇచ్చిన హావిూలను నెరవేర్చుకోగలుగుతామని కేసీఆర్ అన్నారు. తనజీవితానికి తెలంగాణ సాధించిన తృప్తి చాలని, అయితే చిరునవ్వుల తెలంగాణ కోసం ఇంకా ఉద్యమించాల్సిందేనని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అధికారం దక్కించుకునేందుకు అందరూ ఉద్యమించాలని అన్నారు. మాయామశ్చీంద్రల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. తెలంగాణ కోసం ఎవరు ఎలాంటి ఉద్యమాలు చేశారో తెలియంది కాదన్నారు. రాష్ట్ర విభజనను ఆపుతామంటూ సీమాంధ్ర నేతలు ఇంకా మభ్యపెడుతున్నారని విమర్శించారు. జేజమ్మలు దిగొచ్చిన తెలంగాణ ఆగదని పేర్కొన్నారు. 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. అయితే సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని పరిష్కరించుకుందామని అన్నారు. ఇకపై తెలంగాణ ప్రజలు ఉద్యమస్ఫూర్తితో పునర్నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. చిరునవ్వుల తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తా అని అన్నారు. దీనికోసం నిరుద్యోగులు, రైతులు ఎంతో ఆశతో ఎదిరి చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగపడేది గిరిజన, దళితులేనని కేసీఆర్ అన్నారు. ఇన్నాళ్లూ ఉద్యమించామని, ఇప్పుడు ఇక సాధించుకున్న రాష్ట్రం పునర్నిర్మాణానికి ఉద్యమిద్దామని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పని అయిపోలేదని, బంగారు తెలంగాణను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రంపై కోటానుకోట్ల ఆశలున్నాయని, రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్నామని, ఇప్పుడు పునర్నిర్మాణ ఉద్యమం మొదలుపెడదామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పటిష్ఠమైన నాయకత్వం కావాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిపాలన యంత్రాంగం రోజుకు 24 గంటలపాటు పనిచేసినా సరిపోదని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీల నాయకత్వాలను కోరుకోవడం లేదని, తెలంగాణ ప్రాంత నేతలు ఇంకెందుకు టిడిపిలో ఉంటున్నారని, కట్టకట్టుకొని బయటకు రావాలని అన్నారు. తెలంగాణలో ఇంకా సీమాంధ్ర పాలన అవసరమా అని అన్నారు. ఎవరెవరో పార్టీలు పెడతామని వస్తున్నారని వారిని నమ్మొద్దన్నారు. గతంలో కేసీఆర్‌ను తాము తప్పుగా అపార్థం చేసుకున్నామని కొండా సురేఖ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలనే టీఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు. కేసీఆర్‌తో రెండు గంటలు మాట్లాడిన తర్వాత ఆయన వ్యక్తిత్వం తెలిసిందన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని పునరుద్ఘాటించారు. తెలంగాణకు అన్యాయం జరగొద్దంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్ తమకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. కొండా సురేఖ చేరికతో వరంగల్‌లో టీఆర్‌ఎస్ మరింత బలపడుతుందని ఆ పార్టీ నేత కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ఇంకా టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన చెప్పారు.