కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తే సీపీఐతో కటీఫ్
టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో తమ్మినేని
హైదరాబాద్, మార్చి 25 (జనంసాక్షి) :
ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలి సి వెళ్లేందుకు తమకు అ భ్యంతరం లేదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం స్పష్టం చేశా రు. అయితే కాంగ్రెస్‌తో సీపీఐ కలిసివెళ్తే మాత్రం తమమధ్య తెగతెంపులే ఉం టాయని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరే కించే శక్తులతో కలిసి పని చేయాలని,
లేని పక్షంలో ఒంటరిగానే సాగాలన్న తమ జాతీయ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (బీ-451) ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. సోదర పార్టీ సీపీఐ కాంగ్రెస్‌కు దూరంగానే ఉండాలని కోరామని, అదేవిధంగా ఉంటుందనే ఇప్పటికీ భావిస్తున్నామని వీరభద్రం చెప్పారు. 17 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీకి ఉండాలని నిర్ణయించినట్లు తెలిపిన ఆయన, వివిధ పార్టీలతో వచ్చే అవగాహనల ఆధారంగా హెచ్చుతగ్గులుంటాయన్నారు. రాజకీయంగా తాము కొన్న కట్టుబాట్లను పాటిస్తామన్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం పనిచేయమన్నారు. అలాంటి పార్టీలను దూరంగా పెడతామన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ముందు చాలా సమస్యలున్నాయని, వీటితోపాటు ఈ ప్రాంత ప్రజలు సకల సౌకర్యాలు వచ్చి, వెనకబాటుతనం దూరమవుతుందనే ఆశతో ఉన్నారని వీరభద్రం అభిప్రాయపడ్డారు. సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరుప్రాంతాల సామరస్యం, పరస్పర సహకారం ఆధారంగానే తెలంగాణ ముందుకు సాగే అవకాశం ఉందన్నారు. ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయంతో తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తమ్మినేని అన్నారు. అందుకు ఇరు ప్రాంతాల సామరస్యం, సహకారం కూడా తోడ్పడతాయన్నారు. వివిధ వర్గాలను అభివృద్ది చేస్తూనే సామాజిక న్యాయం పాటించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అనుసరించిన అర్థిక విధానాలను రాబోయే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తే అభివృద్ధి శూన్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో అభివృద్ది అనేదే ప్రాతిపదిక కావాల్సి ఉందన్నారు. నూతన రాష్ట్రంలో తమకు సకల సౌకర్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలోనూ చాలా సమస్యలున్నాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో బడుగు బలహీన అణగారి వర్గాలు తమకు భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో పాటు మరిన్ని నిధులు వారికి ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేయాలని కోరారు. ఇప్పుడున్న స్థితిలో పోలవరం నిర్మాణం కారణంగా అనేక సమస్యలు వస్తాయన్నారు. దీనిని తాము ముందునుంచి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గిరజనులను పణంగా పెట్టి ప్రాజెక్ట్ కట్టాలనుకోవడం సరికాదన్నారు. ఎవరికి నష్టం కాకుండా ఉండేందుకు డిజైన్ మార్చాలన్నారు. పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నారని విమర్శించారు. సీమాంధ్రలో కలిపిన ఏడు మండలాలను వెనక్కు ఇవ్వాలని కోరారు. సబ్సిడీలను ఎత్తేస్తేనే ఆర్థికరంగం బలపడుతందనేది సరికాదన్నారు. నయా ఉదారవాద విధానం ప్రపంచాన్ని శాసిస్తోందని తెలిపారు. సబ్సిడీలను ఎత్తివేసే విధానాలు ప్రజలను అభివృద్ధి పథంలో నడప లేవని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గతానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఓటు, ఎన్నికలు భవిష్యత్ కు సంబంధించిన విషయమని అన్నారు. ఓటు సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని చెప్పారు. ప్రజానుకూల విధానాలను అనుసరించే పార్టీలకు, నేతలకు ఓటు వేయాలని సూచించారు. నిధులు, అధికారాలు కేంద్రం వద్ద కేంద్రీకృతమవ్వడంతోనే రాష్ట్ర అభివృద్ధిలో అసమానతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపీయేతర పార్టీలను కలుపుకుపోతామని చెప్పారు. టిఆర్‌ఎస్‌తో కలసి పనిచేయడానికి అభ్యంతరం లేదన్నారు. అయితే అభివృద్ది ఎజెండాగా కలసి సాగుతామన్నారు. మీట్ ది ప్రెస్‌లో యూనియన్ నాయకులు శ్రీనివాసరెడ్డి, విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.