కేసీఆర్‌కు అభివృద్ధి తెలియదు


ఓట్ల కోసమే కొత్త పల్లవితెలంగాణ శ్రీపీసీసీ చీఫ్‌ పొన్నాల
హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావుకు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియదని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఏనాడూ అభివృద్ధిపై మాట్లాడని కేసీఆర్‌ ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అలవికాని హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఆయన హామీల తీరును పొన్నాల ఎద్దేవా చేశారు. ఆకాశాన్ని కిందికి తెస్తాననే స్థాయిలో కేసీఆర్‌ ఎన్నికల హామీలున్నాయని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మెదక్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి చట్టసభలకు ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్‌ ఆయా జిల్లాల్లో అభివృద్ధికి కేసీఆర్‌ ఏ ప్రతిపాదనలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే కేసీఆర్‌ అభివృద్ధి వాదాన్ని ఎత్తుకున్నారని పొన్నాల విమర్శించారు. తెలంగాణ రాకముందు ఒకలాగా, వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇదంతా ఓట్ల కోసమే అన్నది ప్రజలు గ్రహించరనుకుంటే ఏమీ చేయలేమన్నారు. ప్రజలు అన్నీ గ్రహించి చూస్తారని అన్నారు. ఇదిలా ఉంటే పొత్తలపై చర్చించేందుకు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ హస్తిన బయల్దేరి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై, సీపీఐతో పొత్తుల అంశంపై అధిష్టాన పెద్దలతో పొన్నాల చర్చించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు తెలుస్తోంది. సీపీఐతో దాదాపు పొత్తులు ఖారరాయ్యాయని అన్నారు. అయితే ఎక్కడెక్క పోటీ చేసేది తదుపరి ప్రకటిస్తామన్నారు. భువనగిరి నుంచి తనకుతానుగా పోటీ చేస్తానని ప్రకటించలేదని పొన్నాల తేల్చిచెప్పారు. అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశించినా తాను శిరసావహిస్తానని పొన్నాల తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని, సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. తాము కేసీఆర్‌లాగా గడియకో మాట మాట్లాడటం లేదని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని చెప్పారు. అందుకోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సిద్ధమని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ఆ విషయాన్ని తేల్చిచెప్పామన్నారు.