కోటి రూపాయలకు ఒక్కో ప్రశ్నపత్రం

బ్రోకర్లంతా సిండికేటై బొక్కేశారు శ్రీఅంగట్లో వైద్య విద్య
మెడికల్‌ పీజీ అక్రమాలపై నిగ్గుతేల్చిన సీఐడీ శ్రీపలువురు అక్రమార్కుల అరెస్టు
హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) :
పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఒక్కో ప్రశ్నాపత్రాన్ని కోటి రూపాయల చొప్పున అమ్ముకున్నట్లు సీఐడీ విచారణలో నిగ్గు తేల్చింది. పీజీ వైద్య విద్య ప్రవేశపరీక్షల్లో అక్రమాలను సీఐడీ నిర్దారించింది. పీజీ మెడికల్‌ స్కాంను సీఐడీ ఛేదించింది. శ్రీనగర్‌ కాలనీలోని వర్జిన్‌ కన్సల్టెన్సీ నుంచి కుంభకోణం జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. బ్రోకర్లు సాయినాథ్‌, మునీశ్వర్‌రెడ్డితో పాటు ఐదుగురు విద్యార్థులు సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఫిబ్రవరి 25, 26న బ్రోకర్లు పేపర్‌ అమ్మినట్లు నిర్దారించారు. ఒక్కో పేపర్‌ను రూ. కోటికి పైగా అమ్మినట్లు నిర్థారించింది. ప్రధాన సూత్రధారి అజాంసింగ్‌గా గుర్తించారు. ఇందులో ఎవరు ఎలా రింగ్‌ అయ్యిందీ సిఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్‌ మీడియాకు వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు విచారణ బృందాలను పంపామని, ప్రవేశపరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ జరిగినట్లు ధ్రువీకరించామని ఆయన తెలిపారు. అక్రమార్కులు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో బ్రోకరింగ్‌ చేశారని, మేనేజ్‌మెంట్‌, బ్రోకర్లు కలిసి పెద్దఎత్తున డబ్బు వసూలుచేశారని డీజీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఒక్కో కోర్సు కు గరిష్ఠంగా కోటిన్నర రూపాయలు వసూలు చేశార న్నారు. పీజీ ప్రశ్నపత్రం జిరాక్స్‌ కాపీలో సమాధానాలు టిక్‌ చేసి మరీ విద్యార్థులకు ఇచ్చారని, బ్రోకర్లు అంతా సిండికేట్‌ అయ్యి, ప్రశ్నపత్రం లీక్‌ చేశారని అధికారులు తెలిపారు. ముంబయి, హైదరాబాద్‌లోని రహస్య ప్రదేశాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, విద్యార్థులనుంచి అడ్వాన్సు కింద రూ.10 లక్షలు తీసుకున్నారని, అడ్వాన్సు ఇవ్వలేని వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తమ దగ్గర సెక్యూరిటీగా ఉంచుకున్నారని డీజీ కృష్ణప్రసాద్‌ చెప్పారు. పలువురు విద్యార్థులు డబ్బును ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడం, పదేసి చొప్పున చెక్కులు ఇవ్వడం చేశారని పేర్కొన్నారు. వీరిలో 25 మందికి టాప్‌ ర్యాంకులు వచ్చాయన్నారు. ఇద్దరు బ్రోకర్లను అరెస్టు చేశామని తెలిపిన అధికారులు రాయచోటికి చెందిన కె. మునీశ్వర్‌రెడ్డి, నిజామాబాద్‌కు చెందిన సాయినాథ్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. 12 మంది బ్రోకర్లు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని వారందరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఎన్జీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ప్రవేశ పరీక్షలో మాల్‌ ప్రాక్టిస్‌ జరిగిందని సీఐడీ చీఫ్‌ కృష్ణప్రసాద్‌ స్పష్టం చేశారు. అక్రమాలపై ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. అక్రమార్కులు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో బ్రోకరింగ్‌ చేశారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో సీఐడి చీఫ్‌ కృష్ణప్రసాద్‌ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ కుంభకోణంపై పూర్తి స్థాయి నివేదికను ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఐడీ చీఫ్‌ అందించినట్లు తెలుస్తోంది. విలేకరులకు వివరించేముందు ఆయన నరసింహన్‌కు పూర్తి నివేదిక అందజేశారు.