ప్రశాంతంగా పుర పోలింగ్‌


వెల్లువెత్తిన ఓటరు చైతన్యం

కోర్టు తీర్పుతోనే ఫలితాలు

ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ : రమాకాంత్‌రెడ్డి

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 76.46 శాతం

నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 66.41 శాతం పోలింగ్‌

హైదరాబాద్‌,మార్చి 30 (జనంసాక్షి) :

మునిసిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నా పురపాలక ఎన్నికల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఎన్నికల సంఘం కార్యాలయం బుద్దభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలుచోట్ల ఇంకా క్యూలైన్లలో ఓటర్లు ఉన్నారని, రాత్రి ఏడుగంటలకు పోలింగ్‌ పూర్తవుతుందన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఏడు చోట్ల మాత్రమే రీపోలింగ్‌ జరపాల్సిన అవసరం ఉండవచ్చని రమాకాంత్‌రెడ్డి చెప్పారు. నల్గొండలో 2, నందిగామలో 2, తాడిపత్రి, మదనపల్లిలో చెరో చోట రీపోలింగ్‌ జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రీపోలింగ్‌ ఏప్రిల్‌ ఒకటిన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి పరీక్షలకు ఇబ్బంది లేకుండా పోలింగ్‌కేంద్రానికి సవిూపంలో ఉన్న ప్రభుత్వ భవనంలో రీ పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాచర్ల సంఘటనలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మడకశిరలో మార్కెటింగ్‌ ఛైర్మన్‌పై ఎస్సై దాడి చేసినట్లు తెలిసిందని, విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ఇదిలావుంటే నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ శామ్యూల్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో అలసత్వం ప్రదర్శించారని, పోలింగ్‌ శాతం ఇవ్వడంలోనూ శామ్యూల్‌ విఫలమయ్యారని ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. వరంగల్‌ జిల్లా జనగామలోని 27 వార్డులకుగాను సుమారు 10 వార్డులకు పోలింగ్‌ ఇంకా మందకొడిగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్‌ కేంద్రాలకు వెల్లివెత్తినా, అధికారులు ఎన్నికల నిర్వహణలో ఆ ఉత్సాహం కనబరచకపోవడంతో సుమారు మూడు గంటల నుంచి వందలాది మంది ఓటర్లు బారులు తీరారు. 9వ వార్డు, 18, 19, 28, 11 తదితర వార్డుల్లోని బూత్‌లలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంకా రెండుగంటల పైనే సమయం పడుతుంది. మహిళలు, పురుషులు పెద్దఎత్తున వరుసల్లో వేచి ఉన్నారు. తాగడానికి నీరు లేక, కూర్చోవడానికి సరైన వసతి లేక వృద్ధులు, చంటిపిల్లలతో వచ్చిన మహిళలు ఎండకు విలవిలలాడారు. పోలింగ్‌ కేంద్రం లోపల గుడ్డి వెలుతురులో ఈవీఎంలను నడిపించలేక, ఓటర్లను సముదాయించలేక ఎన్నికల అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. 1400 మంది ఓటర్లకు పైచిలుకు ఉన్న కేంద్రాల్లోనూ సౄ, పురుష ఓటర్లకు కలిపి ఒకే ఈవీఎంను ఏర్పాటు చేయటమే ఈ తిప్పలకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ వైఫల్యాలను సవిూక్షించి ఇబ్బందులను పరిహరించాలని ఓటర్లు కోరుతున్నారు. వేసవి కావటంతో ఎక్కువ మంది పురుష ఓటర్లు మధ్యాహ్నం 3గంటల తరువాత పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. ఉదయం 7గంటలకు ప్రాంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 10 నగరపాలక సంస్థలు, 145 పురపాలక సంఘాల్లో ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా ఇంకా చాలా చోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరి ఉన్నారు. దీంతో పోలింగ్‌ బూత్‌ ప్రాంగణంలో క్యూలైన్లలో ఉన్నవారంతా ఎంత సమయమైనా ఓటు వేయవచ్చని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. వీరికి చీటీలు ఇచ్చి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరుగుతున్న మున్సిపల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈవీఎంను బల్లకేసి కొట్టి ధ్వంసం చేసిన లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. పురపాలక ఎన్నికల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. మడకశిరలో మార్కెటింగ్‌ ఛైర్మన్‌పై ఎస్సై దాడి చేసినట్లు తెలిసిందని, విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని అనాసాగరంలోని 19వ వార్డు రెండో పోలింగ్‌ బూతులో పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఇదే వార్డులో హనుమంతుపాలెం, అనాసాగరం గ్రామాల్లో రెండు పోలింగ్‌ బూతులు ఉన్నాయి. ఈ రెండు బూత్‌ల ఓటరు లిస్టులు తారుమారుకావటంతో ఉదయం పోలింగ్‌ నిలిచిపోయింది. మధ్యాహ్నం అధికారులు ఓటర్‌ లిస్టులను మార్పిడి చేయటంతో అనాసాగరం పోలింగ్‌బూత్‌లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్‌ కేంద్రం ఆవరణలోకి వచ్చిన ఓటర్లందరిచేత రాత్రి ఎంత సమయం అయినా ఓట్లు వేయిస్తామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రజినీకాంతరావు తెలిపారు. ఇదిలా ఉండగా హనుమంతుపాలెం బూత్‌లో మాత్రం ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. తూర్పుగోదావరి జిల్లా  పెద్దాపురం పట్టణం ఒకటో వార్డు పరిధిలోని దమ్ముపేటకు చెందిన 60 మంది ఓటర్లు ఓటు వేయకుండా బహిష్కరించారు. గత 20 ఏళ్లుగా తమ సమస్యల గురించి పాలకులెవరూ పట్టించుకోకపోవడంతో పోలింగ్‌ను బహిష్కరించినట్లు వారు తెలిపారు.
తెలంగాణ జిల్లాల్లో పోలింగ్‌ శాతాలు ఇలా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా 75.5 శాతం, నిజామాబాద్‌ జిల్లాలో 66.41 శాతం, మెదక్‌లో 76.31 శాతం, నల్గొండ జిల్లాలో 76 శాతం, ఖమ్మం జిల్లాలో 77.46 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.40 శాతం వరంగల్‌ జిల్లాలో 77.03 శాతం, కరీంనగర్‌ జిల్లాలో 75.29 శాతం పోలింగ్‌ నమోదైంది.