మోగింది తెలంగాణలో ఎన్నికల నగారా
9 వరకు నామినేషన్లు
30న ఎన్నికలు : భన్వర్‌లాల్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ప్రత్యేక రాష్ట్రంలో జరు గబోతున్న తొలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. తెలంగాణ ప్రాం తంలో జరిగే తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈసీ బుధవారం విడు దల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతున్నా తొలిదశలో మా త్రం తెలంగాణలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు ఈ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో బుధవారం నుంచే నామినేషన్ల పక్రియ మొదలయ్యింది. ఈ మేరకు జిల్లాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశా రు. ఈ ప్రక్రియ ఈనెల 9 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల
వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 10న నామినేషన్ల పరిశీలన జరుగగా, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 12 చివరి తేదీ. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 30 పోలింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో మొత్తం మూడు వాహనాలకే అనుమతి ఇస్తారు. అభ్యర్థి సహా మరో ఐదుగురికి మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న నామినేష్లను తిరస్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా అభ్యర్థులకు ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని కూడా నామినేషన్ల సందర్భంగా వెల్లడించాలని భన్వర్‌లాల్ తెలిపారు. ఈనెల 7నుంచి ఈసీ ఓటు పత్రాలు పంపిణీ చేయనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. 10వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 12వ తేదీ వరకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. శాసనసభ నియోజకవర్గ అభ్యర్తులు రూ.10వేలు, లోక్‌సభ అభ్యర్థులు రూ.25వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకు చెందిన అభ్యర్థులకు 50శాతం రాయితీని ఇస్తారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన విధి విధానాలను కూడా ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. ఎమ్మెల్యే అభ్యర్థులు 28 లక్షల రూపాయలు, లోక్‌సభ అభ్యర్థులు 70లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతకు మించి ఖర్చు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తారు. తొలివిడత 2.7 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తొలి దశలో తెలంగాణ ప్రాంతంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం 29,138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేవరకు మధ్యలో వచ్చే మూడు సెలవు దినాల్లో సైతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జగ్జీవన్‌రావు జయంతి, శ్రీ రామనవమి, రెండో శనివారం ఈ మూడు సెలవు దినాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ యథాతథంగా సాగుతుంది. అయితే తొలి దశలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న 11 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4గంటలకే ముగిస్తారు. ఆ తరువాత మలిదశలో సైతం మరో పది నియోజకవర్గాల్లో ఈ నియమ నిబంధన వర్తిస్తోంది. తొలి దశలో తిరుప్పూరు, అసిఫాబాద్, కానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాల్‌పల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈసమయాలు వర్తిస్తాయి. మిగిలిన 108 నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ పూర్తి స్థాయిలో అమలవుతుంది.