కాంగ్రెస్‌తోనే దళితులకు న్యాయం: రఘువీరారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 5 దళితులకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం బాబుజగ్జీవన్‌రాం 107వ జయంతిని పురస్కరించుకుని ఇందిరా భవన్‌లో ఆయన చిత్రపటానికి రఘువీరారెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. రఘువీరారెడ్డితో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్‌కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్‌రాం చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పాటుపడిన మహావ్యక్తి జగ్జీవన్‌రాం అని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం బడుగులను సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా చేసేందుకు ఎంతో శ్రమించారన్నారు. ఆయన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీనవర్గాలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దళితులను సామాజికంగా అభివృద్ధి పరిచేందుకు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. బడ్జెట్‌లో ఎస్సీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టవద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నదన్నారు. దళితులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారన్నారు. ముఖ్యంగా తాను ఢిల్లీ వెళుతున్నట్టు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 7, 8 తేదీలలో అభ్యర్థుల జాబితాతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామన్నారు. సీమాంధ్రలో తాము నిర్వహిస్తున్న బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ అంతం చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.