పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం


స్వేచ్ఛగా ఓటు వేయండి
జెడ్పీటీసీకి తెలుపు, ఎంపీటీసీ గులాబీరంగు బ్యాలెట్‌
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత పోలింగ్‌నకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. బ్యాలెట్‌ పద్ధతిన జరిగే ఈ ఎన్నికల్లో.. జెడ్పీటీసీ అభ్యర్థులను ఎన్నుకునేందుకు తెలుపురంగు బ్యాలెట్‌ పేపరును వినియోగించాలని, ఎంపీటీసీ అభ్యర్థులను ఎన్నుకునేందుకు గులాబిరంగు బ్యాలెట్‌ పేపరును వినియోగించాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్‌ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి క్యూలైనులో ఇంకా బారులుదీరి ఉంటే వారికోసం పోలింగ్‌ సమయాన్ని పొడిగిస్తా మని స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా మంథని నియోజకవర్గంలో మాత్రం పోలింగ్‌ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని చెప్పారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో బ్యాలెట్‌ బాక్సులను మండల కేంద్రానికిగాను, జిల్లా కేంద్రానికి గాని తరలించాల్సి ఉండడంతో అక్కడ మాత్రం సమయాన్ని కుదించినట్టు చెప్పారు. ప్రతి ఓటరుకు రెండు పోల్‌ షీట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. 6,379 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను, 6,412 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశాం. 95,031మంది పోలీసుల సేవలను వినియోగించు కుంటున్నామని వివరించారు. ప్రాదేశిక ఎన్నికల్లో మొత్తం 4,13,01,505మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు పోలింగ్‌ స్టేషన్ల వద్దకు చేరుకుని గొడవ చేయొద్దని సూచించారు. పోలింగ్‌కు అంతరాయం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా 2,68,089 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామని తెలిపారు. లక్షా 50వేల బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశామని చెప్పారు. నిర్భయంగా ఓటు వేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, పోలింగ్‌ మరింత పెరిగేలా సహకరించాలని కోరారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేసి సహకరించాలని కోరారు. 560 జెడ్పీటీసీ స్థానాలతో పాటు వాటి పరిధిలోని మండలాల్లో ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఉమ్మడి రాష్ట్రంలోని సీమాంధ్రలో 334 మండలాల్లో, తెలంగాణలో 226 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించనున్నారు. కరీంగనర్‌ జిల్లా మంథనిలో మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకే నిర్వహిస్తారు. రెండో దశలో ఈ నెల 11న 546 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలివిడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు. 6,370 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామని, 95,031 మంది పోలీసు అధికారులు విధుల్లో పాల్గొంటారని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం ఎన్నికల యంత్రాంగం ఇచ్చే ఓటరు స్లిప్పులు లేకున్నా ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. అయితే స్లిప్పులు ఉంటే పోలింగ్‌ ఆలస్యం కాకుండా, ఓటర్లు కూడా ఇబ్బంది పడకుండా ఓటేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన పురపాలక సంఘాల
ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటరు స్లిప్పులు లేవనే కారణంతో ఓటేయనివ్వలేదన్న నేపథ్యంలో దీనిపై మరోమారు స్పష్టత ఇచ్చారు. ఓటరు స్లిప్పుతోపాటు ఓటరు గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్న గుర్తింపుపత్రాల్లో ఏదో ఒకటి తీసుకుని వచ్చి ఓటేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేరళాయే అభివృద్ధికి నమూనా
ప్రజలను విభజించే వారిపట్ల అప్రమత్తంగా ఉండండి : రాహుల్‌
తిరువనంతపురం, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :కేరళా రాష్ట్రమే దేశంలో అభివృద్ధికి నమూనా అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కితాబిచ్చారు. శనివారం ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీతో కలిసి పాల్గొన్నారు. కేరళ దేశంలో అత్యంత చైతన్యవంతమైన రాష్ట్రమని, ప్రజలు అలాగే తమ ప్రాంతాన్ని కూడా ఎంతో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకున్నారని తెలిపారు. ఉన్నత విద్యావంతులైన ప్రజలు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. మతం, ప్రాంతం ప్రా తిపదికన దేశాన్ని, ప్రజలను విభజించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్రమోడీ గుజరాత్‌ అభివృద్ధి దేశానికి నమూనాలా చూపిస్తున్నారని, కానీ గుజరాత్‌లో
జరిగింది కార్పొరేట్‌ అభివృద్ధి మాత్రమేనని అన్నారు. గుజరాత్‌లో కనీసం స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోని ప్రజలు ఎంతో మంది ఉన్నారని రాహుల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టి అవన్ని తన ఘనతగా మోడీ చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లోని సహజ వనరులను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టడం మినహా ఆయన ఆ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ప్రధాని కావడం కోసం ప్రజల మధ్య తీవ్ర విద్వేషాలు రగల్చేందుకు మోడీ కుట్ర పన్నుతున్నాడని, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులు ఇందుకు కొందరి ఉసిగొల్పుతున్నాయని ఆయన హెచ్చరించారు. కేరళ ప్రజలు లెఫ్ట్‌ ఫ్రంట్‌కు ముఖ్యంగా సీపీఎంకు ఓటేస్తే అది పరోక్షంగా బీజేపీకే అనుకూలమవుతుందని అన్నారు. ఇప్పుడు కేరళ ప్రజల విజ్ఞతతో వ్యవహరించాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లో పర్యాటకరంగం, విద్యావ్యవస్థ, రబ్బరు తోటల అభివృద్ధి దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆదర్శనీయమని రాహుల్‌ చెప్పారు. కేరళలో జరిగిన అభివృద్ధి గుజరాత్‌లాంటి నీటి బుడగ కాదని, ఎక్కువ కాలం నిలిచి ఉంటూ సంపద సృష్టించే అభివృద్ధి అని తెలిపారు. కేరళలోని మేధోవర్గ మానవ సంపదను దేశ అభివృద్ధిలో మరింత కీలకం చేస్తామని, వారి సేవలను ఉపయోగించుకుంటామని రాహుల్‌ అన్నారు. బీజేపీ, మోడీ పన్నుతున్న కుట్రపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నాయని తెలిపారు.