పొత్తు పొడిచింది… కుంపటి రగలింది

దేశ ప్రయోజనాల కోసమే చేతులు కలిపాం : బాబు
తెదేపా సిట్టింగ్‌ సీట్లకు గండి
రాజీనామాలకు సిద్ధమవుతున్న శ్రేణులు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ మధ్య ఎట్టకేలకు పొత్తు పొడించింది. పొత్తు ఒప్పందమైతే కుదిరింది కాని ఇ రు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. ఇరు పార్టీల్లో ఆగ్రహాల కుంపటి రగిలింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య సుమారు 20 రోజులుగా చర్చలు సాగుతున్నా ఇంకా కొలిక్కి వచ్చినటు ్టలేదు. అయినా ఇరు పార్టీల పెద్దలు మాత్రం హడావుడిగా ‘బంధం’ కుదర్చినట్టు సర్వత్రా చర్చ సాగుతోంది. టీడీపీతో పొత్తు వద్దంటూ ఏకంగా తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షు లు తీర్మానం చేసి అధిష్టానం పెద్దలకు సైతం ఇచ్చారు. మ రోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సైతం సముఖంగా లేరు. టీడీపీలోనూ బీజేపీతో పొత్తు వద్దం టూ ఏకంగా చంద్రబాబు నివాసం ఎదుటే ఆందోళనకు దిగారు. ఇన్ని జరిగినా టీడీపీ, బీజేపీ పెద్దలు మాత్రం ఇద్దరి మధ్య ‘బంధం’ కుదర్చడం చర్చనీయాంశమైంది. రాత్రింబవ ళ్లు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణలో బీజేపీకి 47 అసెంబ్లీ, 8 లోక్‌సభ, సీమాంధ్రలో 15 అసెంబ్లీ 5 లోక్‌సభ స్థానాలను ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో చంద్రబాబు బీఫారాల చతరత పాటిస్తే ఈ సంఖ్య తగ్గే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మొదటి నుంచి టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చివరకు ఢిల్లీ పెద్దల ఒత్తిడితో పొత్తుల చర్చలకు అంగీకారం తెలిపినా, ఏ దశలో కూడా పొత్తుల చర్చలు సాఫీగా సాగటంలో కిషన్‌రెడ్డి సహకరించలేదని తెలుస్తోంది. పొత్తుల వ్యవహారం కిషన్‌రెడ్డి చేతిలో పెడితే చివరకు టీడీపీ, బీజేపీ సంబంధాలు దెబ్బతింటాయన్న అనుమానంతో పొత్తుల విషయాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జవదేకర్‌ పలుమార్లు హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. దీంతో కిషన్‌రెడ్డి అప్పటి నుంచి అయిష్టంగా ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తెలంగాణ వ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందునా అంబర్‌పేట నియోజవర్గంలో మరెవరినైనా పోటీ చేయాల్సిందిగా పార్టీ ఢిల్లీ నేతలకు సూచించినట్టు సమాచారం. పొత్తు చర్చలకు హైదరాబాద్‌కు చేరుకున్న జవదేకర్‌.. కిషన్‌ అంతరంగాన్ని గ్రహించి ముందు ఆయనను అనునయించటం  మొదలుపెట్టారు. ఇప్పటి వరకు అయితే కిషన్‌రెడ్డి ఆగ్రహం టీకప్పులో తుపాన్‌ లాంటిదే అయినప్పటికీ ముందుముందు ఏ పరిస్థితికి దారితీస్తుందోనని పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరిన సందర్భంలో  చంద్రబాబునాయుడు, జవదేకర్‌తో జరిగిన ప్రెస్‌మీట్‌కు కిషన్‌రెడ్డి గైర్హాజరయ్యారు. పొత్తులపై అసంతృప్తి వల్లే ఆయన హాజరుకాలేదని తెలుస్తోంది. కాని కిషన్‌రెడ్డి మాత్రం మరోలా అంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ బీజేపీ నేతల్లో కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమేనని, రెండు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని కిషన్‌రెడ్డి అంటున్నారు. కార్యకర్తల ఆందోళనను నివారించడం కోసం పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయానని, అందుకే జవదేకర్‌, చంద్రబాబు ప్రెస్‌మీట్‌కు వెళ్ల లేకపోయాను. అంతేకాని వేరే ఉద్దేశం లేదని మీడియాకు కిషన్‌రెడ్డి తెలిపారు. జాతీయ నాయకత్వం ఆదేశాలను శిరసావహిస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. పొత్తులపై ఒకసారి పూర్వపరాలను పరిశీలిస్తే.. ఒక పక్క భేటీలు, మరోపక్క చర్చలు జరుగుతున్నా ఫలితం కానరాకపోగా ఒక దశలో ఇరు పార్టీల నాయకులు ఆందోళనకు గురయ్యారు.నామినేషన్లు వేసేందుకు కొద్ది రోజులే ఉన్నా ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇరు పార్టీల నేతలు తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. గత గురువారం రాత్రే టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేస్తారని ప్రచారం సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా శుక్రవారం ఉదయానికి జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఏమి జరిగిందో తెలియదు కాని ఇరు పార్టీల నేతలు జాబితాను విడుదల చేయలేదు. ఇంతలో ఊహించని విధంగా బీజేపీ తెలంగాణ జిల్లాల అధ్యక్షులు టీడీపీపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. అసలు టీడీపీతో పొత్తే వద్దని, ఆ పార్టీతో పొత్తు ఉంటే ఎన్ని సీట్లు  గెలుస్తామో పొత్తు లేకపోయినా అన్నే సీట్లు గెలుస్తామని కొత్త రాగం మొదలు పెట్టారు. శనివారం ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన తెలంగాణ బీజేపీ జిల్లాల అధ్యక్షులు పొత్తుకు విముఖంగా తీర్మానం కూడా చేశారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీ నుంచి టీడీపీతో చర్చల కోసం వచ్చిన జవదేకర్‌కు అందించారు. ఊహించని ఈ పరిణామంతో బిత్తరపోయినా, వారితో ఓపిగ్గా మాట్లాడి తిరిగి చర్చలు జరుగుతున్న చోటికి వెళ్లిపోయారు. అయినా ఆగ్రహం తగ్గని బీజేపీ నేతలు జవదేవర్‌ బస చేసిన హోటల్‌ వద్దే కొద్ది సేపు నిరసన తెలిపారు. ఒక దశలో టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపించంది. బీజేపీతో పొత్తులేకపోయినా తమకు నష్టమేమీ లేదని కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు వద్దంటూ తెలుగుతమ్ముళ్లు ఎన్టీఆర్‌ ట్రస్టు వద్ద నిరసనకు దిగారు. తమ వాస్తవ బలం కన్నా బీజేపీ కావాలనే ఎక్కువ సీట్లను అడుగుతుందని వారు మండిపడ్డారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేశారు. వారికి అన్ని సీట్లలోనూ పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోయినా బీజేపీ నేతలు కావాలనే అన్ని సీట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులు లేకుంటే ఇరు పార్టీలూ తెలంగాణలో నష్టపోతాయన్న ఆలోచనతోనే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతుంటే దానిని బీజేపీ నేతలు సాకుగా తీసుకుని ఎక్కువ సీట్లను డిమాండ్‌ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏదిఏమైనప్పటికీ టీడీపీ, బీజేపీ మధ్య పైకి పొత్తు కుదిరినా లోలోపల ఒకరిపై ఒకరు కత్తులు నూరుతున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ సీటును ఆశించి నాలుగేళ్లుగా ఇక్కడ పనిచేసుకుంటున్న మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరికొందరు టీడీపీ నేతలు ఉన్నట్టు సమాచారం. బీజేపీని వీడేందుకు కూడా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో లాబీయింగ్‌ చేసిన బీజేపీతో కలిసి పోటీ చేస్తే గెలిచే సీట్లు కూడా ఓడుతామని బీజేపీ నేతలు భయాందోళన చెందుతున్నారు.
బీజేపీ- టీడీపీ పొత్తు చారిత్రక నిర్ణయమని రెండు రాష్ట్రాల్లోనూ కలిసి ముందుకెళ్తామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. తమ పొత్తుపై దేశం యావత్‌ ఆసక్తిగా ఎదురు చూస్తోందని 272 స్థానాలను సాధించడం తమ లక్ష్యమని జవదేకర్‌ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆదివారం మరోమారు బిజెపి అగ్రనేతలు జవదేకర్‌, గుజ్రాల్‌ భేటీ అయ్యారు. చర్చలు సానుకూలంగా ముగియడంతో ముగ్గురు సంయుక్తంగా ఒకే వేదికపై నుంచి నిర్ణయం వెల్లడించారు. జవదేకర్‌ మాట్లాడుతూ 15, 20 రోజులుగా చర్చలు జరిపామని తెలిపారు. తమ పొత్తుపై దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బిజెపి, టీడీపీ రెండు రాష్ట్రాల్లోనూ కలిసిపనిచేస్తుందని అన్నారు. అనంతరం బిజెపి అగ్రనేత నరేష్‌ గుజ్రాల్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిజెపి-టీడీపీ కలిసి పనిచేయనున్నాయి. కాంగ్రెస్‌ రహిత భారత్‌ కోసం కలిసి కృషి చేయనున్నాయి. ఇక నుండి టీడీపీ-ఎన్డీఏ భాగస్వామ్యం కొనసాగుతుంది. గతంలో జాతి సంక్షోభంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు తమకు చేదోడుగా నిలిచారు. ఎన్డీఎలోకి చంద్రబాబు రాకతో మరింత పురోగమిస్తుంది. ఇక నుండి టీడీపీ.. ఎన్డీఎ కూటమిలో భాగస్వామి. బాబు రాకతో ఎన్డీఎ మరింత పురోగమిస్తుంది. అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడాలనేది తమ లక్ష్యమని అన్నారు.
కాంగ్రెస్‌ రహిత భారత్‌ లక్ష్యం : చంద్రబాబు
టీడీపీ-బిజెపి మధ్య పొత్తు ఖరారైంది. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల కోసమే.. జాతి క్షేమం కోసమేనని చంద్రబాబు అన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టించింది. కాంగ్రెస్‌ అసమర్ధ పాలనతో దేశమంతా నష్టపోయింది. అవినీతి, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.దేశంలో కాంగ్రెస్‌ను పూర్తిగా భూస్థాపితం చేయాలి.  అవినీతి రహిత భారత్‌ మన లక్ష్యం కావాలి. సీమాంధ్రకు ప్రత్యేకంగా ప్యాకేజీలు ఇవ్వలేదు. పొత్తు వల్ల కొందరికి ఇబ్బందులు ఉంటాయి.. అయినా సహకరించాలి. రాజ్‌నాధ్‌, అరుణ్‌జైట్లీ తదితరులతో మాట్లాడాను. సీమాంధ్రలో బిజెపికి 5 పార్లమెంటు సీట్లు.. 15 అసెంబ్లీ స్థానాలను కేటాయించాం. తెలంగాణాలో 8 పార్లమెంటు.. 47 అసెంబ్లీ స్థానాలను బిజెపికి కేటాయించామని తెలిపారు. సామాజిక తెలంగాణా కావాలి. తెలంగాణాకు విద్యుత్‌ సమస్య ఉంది. సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రం సహకారం అవసరమన్నారు. దేశంలో ధరలు పెరిగిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. సీమాంధ్రలో చాలా సమస్యలున్నాయి. సీమాంధ్రకు ప్యాకేజీలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. సీమాంధ్ర పునర్‌ నిర్మాణానికి నిధులు కావాలి. సీమాంధ్ర రాజధాని నగరం నిర్మాణానికి ఎంతో చేయూత కావాలి. యుపిఎ హయాం మొత్తం కుంభకోణాల మయం. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం. అవినీతి రహిత సమాజం బిజెపి, టీడీపీ వల్లే సాధ్యం. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తాం. ఎన్డీఎ 300కు పైగా స్థానాల్లో గెలుపొందడం ఖాయం. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నాం. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. పొత్తుల వల్ల ఇబ్బందులు సహజం.. సహకరించాలి. టికెట్టు రానివారు నిరాశ పడొద్దు.. టిక్కెట్లు రాని వారికి రాజ్యసభలోను, మండలిలోను అవకాశం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. ఇప్పుడు దేశమంతా మోడీకి మద్దతు పలుకుతోంది. రానున్న ఎన్నికల్లో ఎన్డీఎ కూటమి ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జాతీయ నాయకత్వం ఆదేశాలను శిరసావహిస్తానని టీ.బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ బిజెపి నేతల్లో కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమే. రెండు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని కిషన్‌రెడ్డి అన్నారు. కార్యకర్తల ఆందోళనను నివారించడం కోసం పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయాను. అందుకే జవదేకర్‌, చంద్రబాబు ప్రెస్‌మీట్‌కు వెళ్ల లేకపోయాను. అంతేకాని వేరే ఉద్దేశం లేదని మీడియాకు కిషన్‌రెడ్డి తెలిపారు.