ఇంకా మిణుకు మిణుకు ఆశలు


కాంగ్రెస్‌-తెరాస పొత్తు పొడవచ్చట!
అందుకే అర్ధాంతరంగా జాబితా ఆపిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య పొత్తుకు ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఇందుకోసం ఇరు పార్టీల నేతలు చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా చదువుతుండగా అర్ధాంతరంగా అధిష్టానం జాబితా వెల్లడిని నిలిపివేసింది పొత్తు కోసమేననే కథనాలు వినవస్తున్నాయి. శనివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతిధిని రణదీప్‌ తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే పార్టీ అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తుండగా అధిష్టానం పెద్దలు ఫోన్‌ చేసి ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనను నిలిపివేయించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం చర్చలు సాగిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి పదవిపై కేసీఆర్‌ బెట్టు చేస్తుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలిపింది. అయితే తెలంగాణలో నామినేషన్ల దాఖలు ఆఖరు రోజు బుధవారమే కావడంతో ఈలోగా ఇరు పార్టీల మధ్య అవగాహన సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ కూటమిని దెబ్బతీయాలంటే ప్రత్యక్ష పొత్తు సాధ్యం కాకున్నా పరోక్ష అవగాహ చేసుకుంటే ఇరు పార్టీలకు ఉభయ తారకంగా ఉంటుందనేది కాంగ్రెస్‌ ప్రతిపాదనగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి 47 శాసనసభ, 8 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించడంతో ఆ పార్టీ విజయం సాధించే అవకాశమున్న చోట కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు టీఆర్‌ఎస్‌ సహకారం అర్థిస్తున్నట్లుగా తెలిసింది. టీడీపీ, బీజేపీ పొత్తు ఫలవంతం కాకుండా చూడటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఒకవేళ సోమవారం సాయంత్రంలోగా టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదా అవగాహన కుదిరితే జాబితాలో మార్పులు చేసేందుకు వీలుగా ఉండేందుకే కాంగ్రెస్‌ శాసనసభ అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసినట్లుగా తెలిసింది. తెలంగాణలో 119 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 73 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. మరో 46 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్‌ కేవలం పార్లమెంట్‌ అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది ఎమ్మెల్యే ప్రకటనను వాయిదా వేసింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత తెలంగాణ నుంచి పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వార్తలు వెలువడినా ఏఐసీసీ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఒకానొక దశలో టీ పీసీసీ చీఫ్‌ కేసీఆర్‌కు అభ్యర్థుల జాబితాతో పాటు బీఫాంలు కూడా అందజేసినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ అర్ధరాత్రి వరకు ఎలాంటి జాబితా వెల్లడి కాలేదు. శనివారం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తున్న రణదీప్‌కు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ నుంచి ఫోన్‌ వచ్చినట్టుగా సమాచారం. ఆయన సూచన మేరకే రణదీప్‌ సూర్జివాలా జాబితాల వెల్లడి నిలిపివేశారని తెలిసింది. టీడీపీ, బీజేపీ కూటమిపై చేయి సాధించేందుకు పొత్తు లేదా అవగాహన తప్పనిసరి అనే అభిప్రాయానికి ఇరు పార్టీలు వచ్చిన నేపథ్యంలో సోమవారం రాత్రికి తప్ప కాంగ్రెస్‌ జాబితా వెల్లడయ్యే అవకాశం లేనట్లుగా తెలిసింది.