హైదరాబాద్ : తెలంగాణలో శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్థుల్లో ఇద్దరు ఎంపీలున్నారు. విజయశాంతి, వి. హన్మంతరావులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు. విజయశాంతికి మెదక్, హన్మంతరావుకు అంబర్పేట స్థానాలు కేటాయించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, నంది ఎల్లయ్య శాసనసభ సమరంలో నిలిచారు.యూత్ కాంగ్రెస్ కోటాలో ముగ్గురికి టికెట్లు దక్కాయి. ఆదిలాబాద్ నుంచి భార్గవ్‌దేశ్ పాండే, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి, భువనగిరి నుంచి పి.వెంకటేశ్వర్లు పేర్లు ఖరారు చేశారు. 111 మంది అభ్యర్థులతో తెలంగాణలో కాంగ్రెస్ ఖరారు చేసిన జాబితాలో బీసీలకు 33, మైనార్టీలకు 4, ఎస్సీలకు19, ఎస్టీలకు 9 సీట్లు కేటాయించారు. మెదక్ సిట్టింగ్ ఎంపి విజయశాంతి, ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో మెదక్ శాసనసభా నియోజకవర్గానికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 16 లోక్ సభా నియోజకవర్గాలతోపాటు 110 శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖమ్మం లోక్ సభ స్థానంతోపాటు తొమ్మిది అసెంబ్లీ సీట్లను సిపిఐకి కేటాయించింది. ఇక తెలంగాణ కోసం ఆందోళన సాగించిన రాజకీయ ఐకాస, ఓయు జెఎసిల నుంచి ఇద్దరేసి నేతలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కింది. 47 స్థానాల్లో జనరల్ అభ్యర్థులను బరిలో దింపగా, ఒక నియోజకవర్గంలో క్రిష్టియన్ అభ్యర్థితోపాటు ఐదుగురు మైనారిటీలకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో ఎనిమిది మంది మహిళా అభ్యర్థులకు స్థానం లభించింది. 20 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 స్థానాల్లో ఎస్టీ, 29 మంది బిసి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ రాజకీయ ఐకాస నుంచి అద్దంకి దయాకర్‌కు నల్గొండ జిల్లా తుంగతుర్తి, కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గజ్జెల కాంతంలకు టిక్కెట్లు కేటాయించారు. ఒయు జెఎసి నేతలు దరువు ఎల్లన్న శ్రీశాంక్‌లకు టిక్కెట్లు ఇచ్చినట్లు ఎఐసిసి అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ప్రకటించారు. సీనియర్లు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకే కేటాయించారు. టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుంచి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ జిల్లా అందోలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టిపిసిసి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ సి దామోదర రాజనర్సింహ, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టు విక్రమార్కకు ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ స్థానం కేటాయించారు. అన్ని సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థుల జాబితా రూపొందించామని ఎఐసిసి అధికార ప్రతినిది రణదీప్ సూర్జివాలా తెలిపారు. అయితే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ రావడంతో మధ్యలోనే రణదీప్, మధ్యలోనే జాబితా వెల్లడి వాయిదా వేస్తూ వెళ్లిపోయారు.