పోలవరం ముంచడంపై మీ వైఖరేంది?


భాజపా, తెదేపాలకు కేసీఆర్‌ సూటి ప్రశ్న
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) :
భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని నోరులేని ఆదివాసీ గ్రామాలను పోలవరం ముంచడంపై మీ వైఖరేంటో చెప్పాంటూ టీడీపీ, బీజేపీలను టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. పోలవరం డిజైన్‌ మార్పుపై బాబు, వెంకయ్యనాయుడుల వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణకు సంబంధించి వివిధ అంశాలపై స్పష్టత ఇవ్వా ల్సి ఉందన్నారు. తెలంగాణపార్టీ శ్రేణులు వద్దన్నా టిడిపి, బిజెపిలు పొత్తు పెట్టుకు న్నా యని కేసీఆర్‌ అన్నారు. ఈ జబర్దస్తీ పొత్తుల మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మేలు జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలని, తెలంగాణలోని కోటి ఎకరాలు పచ్చబడాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఉద్యమపార్టీగా తెలంగాణ తీసుకుని వచ్చిన టిఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణాలో మెరుగైన పాలన అందించగలదన్నారు. ఐఎన్‌టీయూసీ నేతలతో పాటు పలు కార్మిక సంఘాల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. పేరుకే బీజేపీ అని, అదొక నాయుడు వర్గం. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిసి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. వెంకయ్య, చంద్రబాబు ఆంధ్రాకు కొమ్ము కాసేవాళ్లే. తెలంగాణ బీజేపీ నేతలు పొత్తు వద్దని మొత్తుకున్న వెంకయ్యనాయుడు ఎందుకు దోస్తీ కట్టించారు?అని ప్రశ్నించారు. 60 ఏళ్లు గోసపడ్డాం. మళ్లీ మోసపోవద్దు. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అన్నింట్లో తెలంగాణకు న్యాయం జరగాలి. 85 శాతం బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చిరునవ్వు చూడాలె. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రభుత్వాలు ఇంత బాగుంటాయా.. అని ఆశ్చర్యపోతరు అందరూ. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో సకల సమస్యలకు కారణం కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలేనన్నారు. ఈ ప్రభుత్వాలను మనం చూడంది కాదన్నారు. గతంలోనూ వీటి పాలన ఎలాగుంటుందో తెలుసన్నారు. ప్రజలకు మంచి జరగాలంటే.. మంచి ప్రభుత్వం రావాలని అన్నారు. రాజకీయ అవినీతిని వంద శాతం బొందపెట్టాలని, తెలంగాణ సాధించుకున్నందుకు నా జన్మ ధన్యమైందన్నారు. పొన్నాల లక్ష్మయ్య ముమ్మాటికీ సన్నాసే. అందులో డౌటే లేదని మరోమారు పునరుద్ఘాటించారు. మా పార్టీ మేనిఫెస్టోను చూసి కేసీఆర్‌ అరచేతిలో వైంకుఠాన్ని చూపిస్తున్నారని పొన్నాల అన్నారు. బలహీన వర్గాల ఇళ్ల పేరుతో పంది గుడిసెలు కట్టించారు. ఇదేనా పక్కా ఇళ్లంటే అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ 125 గజాల స్థలంలో పక్కాగా రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్లు కటిస్తదని చెప్పారు. ఇదిలావుంటే టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. వలసలతో గులాబీ గుభాళిస్తోంది. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో పలుకార్మిక సంఘాల నేతలు చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఐఎన్‌టీయూసీ మాజీ నేత ఎల్లయ్యతో పాటు పలు కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎల్‌ఐసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు స్వచ్ఛందంగా ఓటేస్తామని చెప్పారు.