అక్రమ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నారు
వెనక్కు పంపాల్సిందే
: దేవీప్రసాద్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) :
తెలంగాణలో అక్రమంగా ఉద్యో గా లు పొందిన సీమాంధ్రులం దరినీ క్రమబద్ధీకరించేందుకు కు ట్ర పన్నుతున్నారని టీఎన్‌జీవోస్ కేంద్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పంపిణీ కోసం నియమించిన కమల్‌నాథన్ కమిటీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ జిల్లా కేడర్‌కు చెందిన ఉద్యోగులను సైతం స్టేట్ కేడర్‌గా అక్రమ పత్రాలు సృష్టించి వారిని ఇక్కడే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారందరినీ వెనక్కు పంపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి చెందిన ఉద్యోగులే పనిచేయాలని, అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని తమపై రుద్దాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అలాగే పెన్షనర్ల పంపిణీ కూడా వారి పుట్టిన ప్రాంతం ఆధారంగానే చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర ఉద్యోగులను రుద్దాలని చూస్తే తాము ఊరుకోబోమన్నారు. ఉద్యోగుల పంపిణీ సక్రమంగా సాగడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దేవీప్రసాద్ కమిటీ బృందాన్ని కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొంది ఈ ప్రాంతం అవకాశాలు దెబ్బతీసిన వాళ్లు ఇంకా ఇక్కడే తిష్ట వేసేందుకు అనేక అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనైనా వారిని ఇక్కడి నుంచి పంపివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కమల్‌నాథన్ కమిటీ గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో పాటు కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ పాల్గొన్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై రూప కల్పనపై వారు గవర్నర్‌తో చర్చించారు.