మేము స్నేహ పూర్వ‌కంగా క‌లిసాం

చెన్నయ్: సరికొత్త ఊహాగానాలకు ఊతమిస్తున్నట్లుగా బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో కలుసుకున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. మోడీకి తాను ‘శ్రేయోభిలాషి’ ని అని తెలిపిన తమిళ సూపర్ సార్ట్ ఆయనకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. అలాగే రజనీకాంత్ తనకు ‘మంచి మిత్రుడు’ అని మోడి తెలిపారు.

“ఇది రాజకీయ భేటీ కాదు. నేను ఆస్పత్రిలో చేరినప్పుడు నన్ను చూడ్డానికి మోడి వచ్చారు. చెన్నయ్‌కు వచ్చినప్పుడు నాతో టీ తాగాలని ఆయన్ను ఆహ్వానించాను. అందుకే ఆయనిప్పుడు వచ్చారు” అని తన పొయెస్ గార్డెన్ నివాసం వెలుపల విలేకరులతో రజనీకాంత్ అన్నారు. మోడీ సమక్షంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ “ఆయన ఇక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నా” అని తమిళ సూపర్ స్టార్ తెలిపారు.

సూపర్ స్టార్‌ను చూడ్డానికి పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానుల మధ్య రజనీకాంత్, మోడి కరచాలనం చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. “ఆయన నా శ్రేయోభిలాషి. నేను ఆయనకు శ్రేయోభిలాషిని” అని రజనీకాంత్ తెలిపారు.

ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ “తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన నాకు మంచి మిత్రుడు” అని చెప్పారు. విమానాశ్రయానికి వచ్చిన మోడి నేరుగా రజనీకాంత్ నివాసానికి చేరుకున్నారు. క్లుప్తంగా జరిగిన సమావేశంలో శుభాభినందనలు పంచుకున్నారు.