-->

ఎన్నికల అనంతరం ఎన్‌డీఏతో కలువం

జలయజ్ఞంలో వైఎస్‌, పొన్నాల తిన్నది కక్కిస్తాం
కాంగ్రెస్‌తో విలీనం ప్రజలే వద్దన్నారు
ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్‌
కరీంనగర్‌సిటీ, ఏప్రిల్‌ 13 (జనంసాక్షి) :సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్‌ డీఏతో కలువబోమని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలం గాణ రాష్ట్ర సమితి నూటికి నూరు శాతం సెక్యులర్‌ పార్టీ అని, మతతత్వ పార్టీల తో జత కట్టదని కేసీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ, డిగ్రీ, పిజీ కళాశాలలో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభ ద్వారా సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం,
సిక్కు, క్రైస్తవులంతా అన్నదమ్ముల తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఉండాలన్నదే టీఆర్‌ఎస్‌ అభిమతమన్నారు. తెలంగాణ గంగాజమున తెహజీబ్‌కు ప్రతీక అని ఆయన తెలిపారు. ఎన్‌డీఏ, యూపీఏ కూటమిలకు మద్దతు ఇచ్చేదిలేదని, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే మూడవ కూటమికే టీఆర్‌ఎస్‌ మద్దతిస్తుందని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఎన్‌డీఏ కూటమికి 200 సీట్లు కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల హయాంలో జరిగిన జలయజ్ఞం అవినీతి కక్కిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దోస్తానేందని, చంద్రబాబుకు తెలంగాణలో ఏం పనినని ప్రశ్నించారు. 2001లో ఎస్సారార్‌ వేదికగా జరిగిన సింహగర్జన తొలి సభ ద్వారా ఉద్యమంలోకి అడుగుపెట్టానని, ఆనాడు ఆరు నెలలకే పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందన్న చంద్రబాబు పార్టీయే అడ్రస్‌ లేకుండా పోయిందని గుర్తు చేశారు. ఉద్యమ చరిత్రలో కరీంనగర్‌ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడే స్థానం ఉందన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణను నవ తెలంగాణగా నిర్మించుకునేందుకు సహకారం అందించాలని కోరారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల తలరాతను మార్చనున్నాయని, ఏ మాత్రం మోసపోయిన భవిష్యత్‌తరాలకు తీరని అన్యాయం జరిగే ప్రమాదముందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులందరికి తెలంగాణ నిర్మాణంపై సంపూర్ణ అవగాహన ఉందని, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ రూపొందించిన మెనిఫెస్టోను తూయా తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. నిరుపేదలకు 120 చదరపు గజాల స్థలంతో రెండు బెడ్‌ రూంలు, ఒక హాల్‌, ఒక వంట గది ఉండే ఇళ్లు నిర్మించి ఇస్తామని, సంవత్సరానికి లక్ష ఇళ్ల చొప్పున అందిస్తామని వెల్లడించారు. గృహాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు వేయి రూపాయలు, వికలాంగులకు రూ.1500 పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. రూ. లక్ష వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని, రెండేళ్ల తర్వాత రైతులకు 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. గ్రామీణ, పట్టణ పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను సీబీఎస్‌ఈ సిలబస్‌తో కుల, మత బేధాల్లేకుండా అందిస్తానని, 15 ఎకరాల్లో దేవాలయం వంటి అత్యాధునికి సౌకర్యాలు గల భవనాలు నిర్మించి విద్యాలయాలుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి నీరు 900 టీఎంసీలు, కృష్ణా 300 టిఎంసీలను నీరు సద్వినియోగమయ్యేలా ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే టీఆర్‌ఎస్‌ లక్ష్యమన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. ఆటోరిక్షాలకు రవాణా పన్ను మాఫీ చేయడంతో పాటు అధికారుల వేధింపుల్లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవన్నీ కాంగ్రెస్‌కు సాధ్యమా అని ప్రశ్నించారు. సకల జనుల సమ్మె సందర్భంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒక్క పైసా కూడా తెలంగాణకు ఇవ్వా అంటే కాంగ్రెస్‌ శాసనసభ్యులు ఎక్కడున్నారని, ఆయన అడుగులకు మడుగులొత్తారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి, కొమురం భీం విగ్రహాన్ని పోలీస్‌ స్టేషన్‌లో పెట్టిన శ్రీధర్‌బాబును ఓడించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు మాట్లాడుతూ ఏకలవ్యుడు.. ధన్యజీవుడు కేసిఆర్‌ అని, ఆయన నేతృత్వంలోనే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను సర్వనాశనం చేసిన చంద్రబాబుకు ఓటేయ్యద్దని, ఏ మొఖం పెట్టుకొని తెలంగాణ తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహమూద్‌ అలీ, మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బి.వినోద్‌కుమార్‌, బాల్క సుమన్‌, కవిత, అసెంబ్లీ అభ్యర్థులు ఈటల రాజేందర్‌, కెటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, సోమారపు సత్యనారాయణ, కె.విద్యాసాగర్‌ రావు, గంగుల కమలాకర్‌, బొడిగె శోభ, డాక్టర్‌ సంజయ్‌, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, వొడితల సతీష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మన్‌రావు, చెన్నాడి సుధాకర్‌రావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, జిల్లా అధ్యక్షురాలు కటారి రేవతిరావుతో పాటు విద్యార్థి సంఘ నాయకులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.