టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా ఇద్దరు ‘నాయుడ్ల’ కుట్ర
నల్గొండను సస్యశ్యామలం చేస్తా
మూడేళ్లలో 24 గంటల కరెంట్ : కేసీఆర్
నల్గొండ, ఏప్రిల్ 14 (జనంసాక్షి) :
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా టీడీపీ అధ్య క్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ నాయకుడు వెంక య్యనాయుడు కుట్ర పన్నుతున్నారని టీఆర్‌ఎస్ చీఫ్ కె. చంద్రశే ఖర్‌రావు అన్నారు. నల్గొండను సస్యశ్యామలం చేస్తానని, 12 లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత తెలంగాణకు న్యాయం జరగాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడాలని ఆయన ప్రజలకు సూచించారు. సోమవారం సాయంత్రం నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆంధ్రా ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణను విస్మరించడం అన్యాయమన్నారు. తెలంగాణలో ఎనిమది జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ప్లానింగ్ కమిషనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సీమాంధ్ర దోపిడీదా రుల పాలనలో తెలంగాణ అడుగడుగునా అన్యాయమైపోయిందని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును బలవంతంగా గెంటినా హైదారాబాద్‌ను వీడి పోవడం
లేదని మండిపడ్డారు. వెంకయ్యతో కలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి అనేక కుట్రలు పన్నాడని, ఇప్పుడు తెలంగాణలో టీడీపీతో పొత్తును పార్టీ శ్రేణులు వ్యతిరేకించినా టీఆర్‌ఎస్ గెలువకుండా చూడాలనే లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నదని అన్నారు. తాము అనుకున్నది సాధించడం కోసం రేపు తెలంగాణలో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకైనా టీడీపీ వెనుకాడబోదని విమర్శించారు. తమ ప్రభుత్వం నల్గొండ జిల్లాకు సాగునీరు, ప్రతిగ్రామానికి రక్షిత తాగు నీరు అందిస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం తాము పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు విసాలను, అధికారాన్ని అనుభవించారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వాలని ఉంటే 2004లోనే ఇచ్చేదని, ఇప్పుడు ఇవ్వక తప్పని పరిస్థితి తలెత్తింది కాబట్టే కాంగ్రస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల గొప్పతనమేముందని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను ప్రశ్నించారు. మూడేళ్లలో నల్గొండకు ఫ్లోరైడ్ పీడ వదిలిస్తామని అన్నారు. నల్గొండ ప్రజల కష్టాలకు కారణమైన ఆంధ్రా పాలకులకు ఇన్నాళ్లు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఓటెలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. నల్గొండ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు. రైతులందరూ లక్షాధికారులు కావాలనేది తన కల అని తెలిపారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.