హైదరాబాద్: తెలంగాణాలోని ఎన్నికల బరిలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వాటి ఉనికిని బలంగా చాటుకుంటున్నప్పటికీ టిడిపి – బిజెపి కూటమి ఇప్పటికి విజయవంతంగా సాగుతోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. “తెలంగాణాలో ఎన్నికల వాతావరణం కచ్చితంగా బిజెపికి అనుకూలంగా ఉంది. మా ఎమ్మెల్యే, ఎంపీల స్థానాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో బిజెపి శ్రేణులు ధీమాగా ఉన్నారు” అని పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.”తెలంగాణ ప్రజలు బిజెపి, నరేంద్ర మోడి నాయకత్వం కోసం చూస్తున్నారు. మోడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వారి బాధ్యతను నెరవేర్చాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు” అని కిషన్ రెడ్డి తెలిపారు. “మాకు కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నుంచి మరి కొన్ని ప్రాంతాల్లో టిఆర్ఎస్ నుంచి పోటీ ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో మాకు, కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అలాగే ఉత్తర తెలంగాణాలో మాకు, టిఆర్ఎస్ పార్టీకి మధ్య పోటీ ఉంది. మొత్తం మీద ఈ త్రిముఖ పోటీలో టిడిపి-బిజెపి కూటమి మరిన్ని సీట్లు గెలుచుకుంటుంది” అని ఆయన ధీమాగా చెప్పారు. సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం తెలంగాణాలో 119 అసెంబ్లీ స్థానాలకు 47 స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలకు 8 స్థానాలను బిజెపి పొందింది. ఏప్రిల్ 22న తెలంగాణాలో మోడీ ప్రసంగించే బహిరంగ సభలపై బిజెపి కోటి ఆశలు పెట్టుకుంది. అనంతరం పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పర్యటిస్తారు. తెలంగాణాలో కూటమి విజయవంతం కావడం కోసం బిజెపి, టిడిపి కలిసి పని చేస్తున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా కిషన్ రెడ్డి బదులిచ్చారు. కాగా తెలంగాణాలో ఎన్నికలు ఏప్రిల్ 30న జరగబోతున్నాయి.