మేడ్‌ ఇన్‌ తెలంగాణ నా స్వప్నం

తెలంగాణ బిల్లు డ్రాఫ్ట్‌ చేశాం.. ఆమోదింపజేసుకున్నాం

బిల్లులో తెరాస పాత్ర లేదు
విలీనం చేస్తామని వాగ్దానం చేశారు..
వెన్నుపోటు పొడిచారు
దళిత ముఖ్యమంత్రి ఏమైంది?
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల
పథకాలకు జాతీయో హోదా
తెలంగాణలో భారీ విద్యుత్‌ ప్రాజెక్టు
యువతకు ఉపాధి.. ప్రపంచ స్థాయి గుర్తింపు
అందుకే తెలంగాణ : రాహుల్‌
మహబూబ్‌నగర్‌/నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) :
తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ దీని అభివృద్దిని కూడా చేసి చూపుతుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. అద్భతమైన తెలంగాణ అబివృద్ధి కేవలం కాంగ్రెస్‌ వల్లనే సాధ్యమని అన్నారు. అరవయ్యేళ్ల కల ఫలించిన సమయమిదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ నెరవేరే క్రమంలో కాంగ్రెస్‌ అద్భుతపాత్ర పోషించిందన్నారు. కేవలం సోనియాగాంధీ తీసుకున్న ధృడ వైఖరి కారణంగానే తెలంగాణ ఏర్పాడిందన్నారు. ఇక అభూతకల్పనలు, ఆచరణ సాధ్యం కానీ హావిూలతో టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కెసిఆర్‌ చెప్పిన మాటమీద నిలబడడని అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడని అన్నారు. ఆయనను నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అద్భుతమైన పారిశ్రామిక విధానంతో ముందుకు రాబోతోందని, ఇక్కడ తయారైన వస్తువులు మేడ్‌ ఇన్‌ తెలంగాణ అన్నట్లుగా పురోభివృద్ది సాధించాలన్నారు. మీ అబివృద్ధి కల సాకారాం కావాలంటే వచ్చే ఎన్నకల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఇది కేవలం కాంగ్రెస్‌ వల్లనే సాధ్యమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని, తమది మాట తప్పే పార్టీ కాదని ఆయన పేర్కొన్నారు. తెదేపా, భాజపా తెలంగాణ రావడానికి అడుగడుగునా అడ్డుపడిన సంగతి అందరికీ తెలుసన్న రాహుల్‌, తెలంగాణ బిల్లు రూపకల్పనలో కానీ, ఆమోదం పొందడంలో కాని తెరాస ఎక్కడన్నా కన్పించిందా అని ప్రశ్నించారు.తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని తెరాస అధినేత తమంతట తామే గతంలో చెప్పారని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామనీ వాళ్లే చెప్పారని రాహుల్‌ గాంధీ అన్నారు. ఆ రెండు అంశాలనూ ఆ పార్టీ ఇప్పుడు మర్చిపోయిందని రాహుల్‌ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సభల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలనూ అధికారంలోకి రాగానే తెరాస మర్చిపోతుందని రాహుల్‌ అన్నారు. తెరాసకు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ కావలసింది అధికారం మాత్రమేనని రాహుల్‌ దుయ్యబట్టారు. అభూతకల్పనలు సృష్టించడమే తెరాస లక్ష్యమని విమర్శించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమతుల్య అభివృద్ధి సాధిస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. లౌకికవాద సిద్దాంతానికి కట్టుబడింది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో పదేళ్లపాటు పన్ను మినహాయింపు కల్పిస్తామని, ప్రాణహిత- చేవెళ్లను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటిస్తామని రాహుల్‌ మహబూబ్‌నగర్‌ వేదికపై హావిూ ఇచ్చారు.పదేళ్ల పాటు తెలంగాణలో టాక్స్‌ హాలిడే అమలుచేస్తామని అన్నారు. కొత్త రాష్ట్రంలోతమకు అధికారం కట్టబెట్టాలని కోరారు. రాష్ట్రం ముందుడాలంటే అనుభవం ఉన్న ప్రభుత్వం రావాలి. అది తెలిసింది కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం. మమ్మల్ని అధికారంలోకి తెస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. దేశంలోనే అతి పెద్దదైన 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు ఇక్కడ ఏర్పాటుచేస్తాం. పదేళ్ల పాటు టాక్స్‌ హాలిడే ఇస్తాం. 60 ఏళ్ల కల ఈ సంవత్సరం జూన్‌ రెండో తేదీన నెరవేరబోతోంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, టీచర్లు, న్యాయవాదులు అందరూ కలిసి పోరాడారు. వందలాదిమంది అమరుల త్యాగఫలితంగా రాష్ట్రం సిద్ధించింది. కాంగ్రెస్‌ లేనిదే ఈ స్వప్నం నెరవేరేదే కాదని అన్నారు. మీ మాట విన్నాం.. ప్రజాస్వామిక పద్ధతిని పాటించాం.. త్వరలోనే మీ కల నెరవేరనుంది. రెండు రాష్టాల్ర కలలనూ కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చబోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం మాది. అందుకే రెండు ప్రాంతాలవాసుల కోరికలను మేం తీరుస్తాం. ఇతర పార్టీలన్నీ తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాయి. బిల్లు విషయంలో టీఆర్‌ఎస్‌ పాత్ర ఏమాత్రం లేదు. సామాజిక న్యాయాన్ని సాధించే ఉద్దేశంతోనే మేమున్నాం. కవ్వింపు, ఉద్రిక్తతలు సృష్టించే ఉద్దేశం మాకు లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు తెలంగాణలో చోటుండాలి. అత్యంత బలహీనవర్గాలకు కూడా న్యాయం జరగాలన్నదే సామాజిక న్యాయం అని అన్నారు. తెలంగాణలో అన్ని మతాలనూ గౌరవిస్తాం, లౌకికవాదానికి కట్టుబడతాం. బీజేపీ వాళ్లు హిందూ ముస్లింల మధ్య తగాదా పెడదామని చూస్తారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే అందరూ సోదరభావంతో ఉండాలని ఆయన చెప్పారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో పేదరికాన్ని తగ్గించామని, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది గొప్ప విజయంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అలాంటివి ఎన్నో పథకాలు రూపకల్పన చేసినట్లు రాహుల్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో ఏర్పాటు చేసిన పథకాలతో దేశంలో కోట్ల మంది లబ్దిపొందారని రాహుల్‌ పేర్కొన్నారు. 15 కోట్లమందికి పేదరికం నుంచి విముక్తి కలిగించామని ఆయన అన్నారు. అంత తక్కువ సమయంలో దేశ చరిత్రలో ఎన్నడూ అంతమంది పేదరికం నుంచి బయట పడలేదని ఆయన స్పష్టం చేశారు. వారికి కొన్ని ఖచ్చితమైన హక్కులు కల్పించడం ద్వారా దాన్ని మేం సాధించామని రాహుల్‌ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం వేలమంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేలా చేసిందని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆచార్య జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీల చిత్రపటాలకు రాహుల్‌ నివాళులు అర్పించారు. సభలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రసంగిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్‌ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ మాత్రమే గుర్తించిందని, తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనని ఆయన అన్నారు.సామాజిక తెలంగాణ, సుస్థిత పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని పాలమూరులో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో పొన్నాల మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కలను కాంగ్రెస్‌ పార్టీ సాకారం చేసిందని తెలిపారు. ఫాంహౌస్‌ నేతలు కొత్త కొత్త నినాదాలతో వస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చే సత్తా కాంగ్రెస్‌కే ఉందని పొన్నాల స్పష్టం చేశారు. తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లా అన్నిరంగాల్లో వెనకబడి ఉందని దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపై ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌లో రాహుల్‌గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆమె తెలంగాణ ఉద్యమం పుట్టింది మహబూబ్‌నగర్‌లోనేనని, అలాంటి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉదన్నారు. తెలంగాణపై పార్లమెంటులో కేసీఆర్‌ ఒక్కరోజైనా మాట్లాడలేదని, ఇప్పుడు తనవల్లే తెలంగాణ వచ్చిందని అబద్దాలు చెప్తున్నారని డీకే అరుణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని మాజీ మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని అరుణ తెలిపారు. కేసీఆర్‌ వల్ల తెలంగాణ ఉద్యమం పుట్టలేదని ఆమె అన్నారు. ఉద్యమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి విద్యార్థుల ప్రాణాలు తీసింది కేసీఆరే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్‌ పాలమూరు గురించి ఏనాడూ పార్లమెంటులో ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ సెంటిమెంట్‌పై కేసీఆర్‌ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అల్లరచిల్లరగా మాట్లాడరని, ఆయన నవ్యత, యువత, భవితకు ప్రతినిధి అని కొనియాడారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి. 60ఏళ్ల తెలంగాణ స్వప్నాన్ని నెరవేర్చింది సోనియానేనన్నారు. తెలంగాణ తెచ్చే పక్రియలో తన వంతు పాత్ర పోషించానని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస పార్టీనే కాదు ఓ చిల్లర దుకాణం అని దాన్ని ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసేస్తారో తెలీదని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌ ప్రసంగం అనంతరం పోటీ చేస్తున్న అభ్యర్థులను సభకు పరిచయం చేశారు. రాహుల్‌ ప్రసంగానికి తెలుగు అనువాదక పాత్రలో రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ కనిపించారు.
మహిళాబిల్లును పార్లమెంటులో ప్రతిపక్షమే అడ్డుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనితో సంబంధం లేకుండా కాంగ్రెస్‌ స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. పాలమూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గ్యాస్‌ సిలిండర్లను 9నుంచి 12కు పెంచిన ఘనత తమదేనని రాహుల్‌ గుర్తుచేశారు. సోనియా సంకల్పం వల్లే ఆరోగ్యభద్రత వచ్చిందని, ఉచిత వైద్యం, మందుల పంపిణీ పథకాన్ని చేపడతామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. మరోవైపు దేశాన్ని పేద, ధనిక భాగాలుగా రెండుగా విడదీయడమే ప్రస్తుత ప్రతిపక్షం లక్ష్యమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. దేశాభివృద్ధిలో పేదవాడి భాగస్వామ్యం ఉండాలనేదే కాంగ్రెస్‌ సిద్దాంతమని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించగలిగేది కాంగ్రెసేనన్నారు. గత పదేళ్లలో యూపీఏ పాలనలో ఎంతో ప్రగతి సాధించామని, 14 కోట్ల మందిని పేదరికం, ఆకలిబాధలనుంచి విముక్తి కలిగించామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. 100 రోజుల ఉపాధి, ఆహారభద్రత కల్పించింది యూపీఏనని, వచ్చే ఐదేళ్లలో ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన ఇళ్లు నిర్మిస్తామని రాహుల్‌ తెలిపారు. ఉత్పత్తుల్లో తెలంగాణ బ్రాండ్‌ రావాలని ఆకాంక్షించారు. ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు మీరంతా ఉద్యోగాల గురించి మాట్లాడతారు… కానీ ఒక్కసారి చూడండి. విూ దగ్గరున్న పలు వస్తువులపై మేడిన్‌ చైనా అని ఉంటుంది. మరి మనం తయారు చేస్తున్న వస్తువులు ఏవి? మరికొన్ని సంవత్సరాలలో ఈ పరిస్థితి ఉండకూడదు. వాటి విూద మేడిన్‌ తెలంగాణ, మేడిన్‌ ఇండియా అని ఉండాలి. ఆ ఉత్పాదకత రావాలంటే కాంగ్రెస్‌ నాయకత్వంతోనే సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్లపై చర్చ జరుగుతోంది. వాటి ఏర్పాటు ఆచరణలోకొస్తే విద్యుత్తు, రోడ్లు, నీరు… అన్ని సౌకర్యాలూ వాటంతటవే వస్తాయి. లక్షలాది యువతకు ఉద్యోగాలు వస్తాయి.. అప్పుడు అన్నిటిమీదా మేడిన్‌ ఇండియానే ఉంటుంది.. మేడిన్‌ తెలంగాణ అన్న వస్తువులను విూరు సగర్వంగా ప్రదర్శించగలుగుతారు..’ అంటూ మహబూబ్‌నగర్‌ వేదికపై రాహుల్‌ యువత ముందు ఓ అందమైన కలను ఆవిష్కరించారు. రాహల్‌ సభకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
మేడ్‌ ఇన్‌ తెలంగాణ తన స్వప్నమని, ప్రత్యేక రాష్ట్రాన్ని పరిశ్రమల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్‌ తనను కలసి కృతజ్ఞతలు తెలిపి తనతోనే ఉంటానని వాగ్దానం చేసి మాట మార్చారని రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన తరవాత కెసిఆర్‌ తన కార్యాలయానికి వచ్చారని, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి, తనకు కృతజ్ఞతలు పలుమార్లు తెలిపారని చెప్పారు. తనతో కరచాలనం చేసి తనవెంటే ఉంటానని ఒకటికి రెండుసార్లు హామీ ఇచ్చారన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌/డిచ్‌పల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను అనుమతిస్తే ఆలింగనం చేసుకుంటానని కోరారని, ఆ తర్వాత మరోసారి మీ వెంటే మేముంటామంటూ హామీ ఇచ్చి బయటకు వచ్చారని, వచ్చాక ఆ విషయం ఆయన మర్చిపోయారని రాహుల్‌ అన్నారు. కౌగలించుకుని మాటమార్చని కేసీఆర్‌ వ్యవహారం చూస్తే ఆయన తెలంగాణ ప్రజలను కూడా మరచి పోతారని అని రాహుల్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దలితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని, ఆయనది వెన్నుపోటు రాజకీయమని, కేసీఆర్‌ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మా ఇంటికి వచ్చారని, పార్టీని విలీనం చేస్తామని చెప్పారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఏం జరిగినా కాంగ్రెస్‌తోనే ఉంటానని చెప్పారని, తనను ఆలింగనం చేసుకుని హావిూ ఇచ్చి.. వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. మాటకు విలువ ఇవ్వని వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచించాలంటూ రాహుల్‌ కేసీఆర్‌ని పరోక్షంగా విమర్శించారు. ఆయన తొలుత వాగ్దానం చేసి ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్‌కి చెప్పిన అబద్ధమే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పారని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, ఏనాడూ వాగ్దానాలను మరిచిపోలేదని రాహుల్‌గాంధీ అన్నారు. ఒకసారి వాగ్దానం చేశామంటే వెనక్కు తీసుకునేవాళ్లం కాదన్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఎన్నికల బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన అన్ని పార్టీలూ తెలంగాణను వ్యతిరేకించాయన్నారు. సోనియా పూనుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని రాహుల్‌ చెప్పారు. తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. సోనియా సంకల్పం వల్లే తెలంగాణ ఏర్పాటు జరిగిందని, ఆమె లేకుంటే సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నామని, అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం సాధించి రాష్ట్రాన్ని ఇచ్చామని వివరించారు. దీని కోసం కాంగ్రెస్‌ తీవ్ర కసరత్తు చేసిందని అన్నారు. కాంగ్రెస్‌ లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదన్నారు. తెలంగాణ ప్రజల కల సాకారం కావడంలో కాంగ్రెస్‌ పాత్ర ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్‌ సమస్యను తీరుస్తామని, నాలుగువేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన హావిూ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వెనుకబడిన ప్రాంతాలకు పదేళ్ళపాటు పన్ను మినమాయింపు కల్పిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ ¬దా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్దపెద్ద కలలు సాకారమవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాహుల్‌గాంధీ అన్నారు. టీఆర్‌ఎస్‌లాంటి పార్టీలతో అలాంటివి సాధ్యం కావన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే మిగులు ఆదాయం అన్ని జిల్లాల అభివృద్ధికి పంచుతామని, వెనకబడిన జిల్లాల్లో పదేళ్లపాటు పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తిస్తామన్నారు. తెలంగాణలో ఉత్పత్తి రంగ పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందిస్తామన్నారు. కొన్ని ప్రతిపక్షాలు ప్రజలను హిందూ ముస్లింలుగా విడదీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీలేవో ప్రజలకు తెలుసని, తాను పేర్లు చెప్పనని రాహుల్‌ అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాహుల్‌ చెప్పారు. ఒకసారి వాగ్దానం చేస్తే వెనక్కి తీసుకునేవాళ్లం కాదని స్పష్టంచేశారు. రాహుల్‌ ప్రసంగాన్ని ఇటీవలే పార్టీలో చేరిన డాక్టర్‌ దాసోసు శ్రవణ్‌ తర్జుమా చేశారు. వేదకిపై డి శ్రీనివాస్‌, పొన్నాల, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.