మరో రెండు నెలలూ రాష్ట్రపతి పాలనే
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్, శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. మరో రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 356 అధికరణంలోని మూడవ సెక్షన్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన 60 రోజుల్లోగా పార్లమెంట్ దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈనెల 30వ తేదీతో ఈ గడువు ముగిసి పోతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేక పోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పార్లమెంట్ ఆమోదం పొందడానికి 60 రోజుల సమయం లభించింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తదితరులతో సమావేశమై పరిస్థితి చర్చించారు.ఈ నేపథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, పి చిదంబరం, వీరప్ప మొయిలీ, కపిల్ సిబాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పాలన విధించడంపై నిర్ణయం ఆలస్యమైతే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంటూ గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. తదుపరి ఆర్మీ చీఫ్ నియామకంపై కూడా కేబినెట్ చర్చించింది.