తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌

72 శాతం పోలింగ్‌
అత్యధికం నల్గొండ 81 శాతం
హైదరాబాద్‌లో
అత్యల్పంగా 58 శాతం
రీపోలింగ్‌ లేదు : భన్వర్‌లాల్‌
ఓటేసిన గవర్నర్‌ దంపతులు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. త్వరలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడబోతున్న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థా నాలకు, 17 ఎంపీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. 1,669 అ సెంబ్లీ అభ్యర్థులు, 265 ఎంపీ అభ్యర్థులు భవితవ్యం ఈవీఎంలలో నిక్షి ప్తమైంది. ఈనెల 16న వీరి భవితవ్యం తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భూపాలపల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల్లో, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొల్లాపూర్‌, అచ్చంపేట, మంథని, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, చెన్నూ రు, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మిగతా 109 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. సాయం త్రం 5 గంటలకు 68 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల ప్రధా నాధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసే సరికి 72 శాతంగా నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 81 శాతం, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 78 శాతం, మెదక్‌లో 77 శాతం, కరీంనగర్‌లో 76 శాతం, వరంగల్‌లో 75, మహబూబ్‌నగర్‌లో 69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 60 శాతం, హైదరాబాద్‌ జిల్లాలో 58 శాతం పోలింగ్‌ నమోదైంది. చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రారంభంలో పోలింగ్‌ మందకొడిగా జరిగినా 10 గంటల తర్వాత పోలింగ్‌ సరళి పెరిగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటర్లు ఓటు వేసిన అనం తరం పోలింగ్‌ కేంద్రం వద్ద ఫలానావాళ్లకు ఓటేశామని చెప్పకూడదని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. 1961 చట్ట ప్రకారం ఓటు ఎవరికి వేశారో వెల్లడించకూడదని ఆయన చెప్పారు. ఫలానా పార్టీల అభ్యర్థులకు ఓటేశామని ప్రముఖ వ్యక్తులే చెబితే ఓటింగ్‌పై ప్రభావముంటుందని ఆయన అన్నారు. ఇదిలావుంటే పెరిగిన ఓటింగ్‌ శాతం ఎవరిపై ప్రభావం చూపు తుందన్నది అందరిలోనూ గుబులు రేపుతోంది. ఇదిలావుంటే హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో కాంగ్రెస్‌, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ మంత్రి దానం నాగేందర్‌ సమక్షంలో ఇరు పార్టీల నేతల బాహాబాహీకి దిగారు. ఘర్షణకు దిగిన ఇరు పార్టీల నేతలపై పోలీసులు లాఠీలు ఝులిపిం చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. మెదక్‌ జిల్లా, నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్‌ గ్రామంలో మరికెల ఎస్‌ఐ శ్రీధర్‌ అత్యుహ్సహం ప్రదర్శిం చారు. ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలుచున్న ఓటర్లను కొట్టడంతో తోపు లాట జరిగింది. దీంతో నిర్మల అనే గర్భిణి కిందపడిపోయింది. పరిస్థితి విష మంగా మారడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎస్‌ఐ శ్రీధర్‌ తీరుకు నిరసగా గ్రామస్తులు పోలింగ్‌ కేంద్రం తలుపులు మూసివేసి, పొలిం గ్‌ను అడ్డుకున్నారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకునే వరకు
గ్రామంలో పోలింగ్‌ జరగనివ్వమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఎస్‌ఐ శ్రీధర్‌పై 24 గంటలలోపల అధికారులు చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్నానని ఎస్‌ఐ చేతిలో లాఠీ దెబ్బలు తిన్న బాధితుడు పేర్కొన్నాడు. మాకు ఎన్నికలు ముఖ్యంకాదని, మా గ్రామం ఐకమత్యంగా ఉండడమే గొప్పతనమని బాధితుడు తెలిపాడు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై బుధవారం మధ్యాహ్నం దాడి జరిగింది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం, శంకరగిరి తండాలో పోలింగ్‌ బూత్‌ వద్ద జరిగిన గొడవను సర్దిచెప్పేందుకు వెళ్లిన నామాపై దాడి జరిగింది. అక్కడ మద్యం మత్తులో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నామాపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో నామా పిఏ నాగేశ్వరరావు అక్కడే ఉన్నారు. ఆయనకు గాయాలు అయినట్లుగా సమాచారం.నామా నాగేశ్వరరావుకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్‌మెన్‌లు నామాపై ఎవరూ దాడి చేయకుండా అడ్డుకుని ఆయనను కారులో కూర్చొబెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘర్షణలో నామా నాగేశ్వరరావుకు ఎటువంటి గాయాలు కాలేదు. ఆయన పిఏ నాగేశ్వరరావు మాత్రం గాయపడినట్లు తెలియవచ్చింది. ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగిన పోటింగ్‌ చివరి రెండు గంటల ముందు ఈ గొడవ జరగడం పట్ల టీడీపీ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. దీంతో పోలీసులు అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు ఓటు వేశారు. రాజ్‌భవన్‌ ఎదుట ఉన్న రాజ్‌నగర్‌లోని 111వ పోలింగ్‌ బూత్‌లో నరసింహన్‌, ఆయన సతీమణి విమల ఓటు హక్కు వినియోగించుకున్నారు. గవర్నర్‌ ఓటు వేసే సమయంలో ఈవీఎం మొరాయించడంతో అధికారులు హుటాహుటిన సరి చేశారు. ఓటు హక్కు ఎంతో విలువైందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌ అధినేతలు చంద్రబాబు, కేసీఆర్‌ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసులో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌, బాలకృష్ణ, జూబ్లీహిల్స్‌ క్లబ్‌ పోలింగ్‌ కేంద్రంలో కేంద్ర మంత్రి చిరంజీవి, రాంచరణ్‌ ఓటు వేశారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గంలోని స్వగ్రామం చింతమడకలో కేసీఆర్‌ తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు. లోక్‌సత్తా అధినేత జేపీ, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ గాయత్రి హిల్స్‌లోని లిటిల్‌స్టార్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఇష్టమైన సినిమా కోసం ఎంతసేపైనా క్యూలో నిలుచుంటారని, అలాంటిది భవిష్యత్తును నిర్దేశించే ఓటు హక్కు కోసం కొంత సేపు క్యూలో వేచి ఉన్నా ఫర్వాలేదని పవన్‌ అన్నారు. సినీ ప్రముఖులు నాగార్జున, అమల దంపతులు, మోహన్‌బాబు, విష్ణు, మహేశ్‌బాబు, నమ్రతాశిరోద్కర్‌, రామానాయుడు, వెంకటేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు, అల్లు శిరీష్‌, సుమంత్‌, గీతామాధురి, సురేష్‌బాబు, సి.నారాయణరెడ్డి, దర్శకులు రాజమౌళి దంపతులు, తేజ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌, జీవితారాజశేఖర్‌ దంపతులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌, డీజీపీ ప్రసాదరావు, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటింగ్‌ తీరును ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ఈవీఎంలు మొరాయించిన చోట తక్షణమే వేరే ఈవీఎంలను పెట్టి ఓటింగ్‌ కొనసాగించారు. ఓటింగ్‌ సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా భారీ బలగాలను మోహరించారు. అయినా పలుచోట్ల పార్టీల కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. గజ్వేల్‌ మండలం పాములపర్తిలో టీఆర్‌ఎస్‌, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి ఇరువర్గాలను చెదరగొట్టారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
– అంబర్‌పేట నియోజకవర్గంలోని భద్రుకా కాలేజీలోని పోలింగ్‌ కేంద్రంలో దాదాపు గంట పాటు పోలింగ్‌ నిలిచిపోయింది. హిమాయత్‌నగర్‌, రాంనగర్‌, బాగ్‌లింగంపల్లి, సోమాజిగూడలలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.
– తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని భేతాళపాడులో, బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురంలో గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు.
– రహదారి సదుపాయం కల్పించడం లేదని మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కూచారం తండాలో గ్రామస్తులు పోలింగ్‌ బహిష్కరించారు.
– మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.