అమేథి అభివృద్ధి మాతోటే : రాహుల్
అమేథి, మే 4 (జనంసాక్షి) :
అమేథి అభివృద్ధి తమతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తమ కుటుంబం హయాంలో అమేథి ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి రాజీవ్‌గాంధీతో కలిసి అమేథికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం అమేథిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మాట్లాడారు. తాను అమేథికి వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అమేథికి తాను రాజకీయ లబ్ధికోసం రాలేదని, ఈ ప్రాంతం తన మనసుకు ఎంతో దగ్గరయిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. బీజేపీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే యూపీఏ ప్రభుత్వంలో తాము తీసుకువచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ఆయన ప్రజలను హెచ్చరించారు. కాషాయ దళం కనుక అధికారం చేపడితే ఆహార భద్రత, ఉపాధి హామీ పథకాలను రద్దు చేస్తుందని చెప్పారు. అందుకు సంబంధించిన సమాచారం తనకు అందిందని తెలిపారు. గుజరాత్‌లో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టారని, ఇప్పటికీ పేదల వద్ద భూములున్నా వారిని ఆ భూమికి హక్కుదారులుగా పరిగణించడం లేదని ఆయన తెలిపారు. అలాంటి వారి భూములను బలవంతంగా లాక్కొని భూమి నుంచి గెంటివేస్తున్నారని చెప్పారు. మోడీ అభివృద్ధి నమూనా వల్ల అంబానీ, అదానీ లాంటి ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు మాత్రమే లాభపడ్డారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. మోడీ గుజరాత్‌లో 40 వేల కోట్ల విలువజేసి భూమిని అదానీ గ్రూప్‌కు కట్టబెట్టాడని గుర్తు చేశారు.