మోడీ చరిత్ర అధ్యయనం చేయ్‌


దేశ సమగ్రతను కాపాడిందే కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ
ముజఫర్‌పూర్‌, మే 5 (జనంసాక్షి) :బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చరిత్రను అధ్యయనం చేయాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హితవు పలికారు. దేశంలో తానొక్కడినే సచ్చీలుడిని అయినట్టు మోడీ లెక్చర్లు ఇస్తున్నారని సోనియా ఎద్దేవా చేశారు. బీహా ర్‌లోని ముజఫర్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచా రంలో సోనియాగాంధీ పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పేద దేశమైన భారత్‌ను ప్రగతిదాయక దేశంగా తీర్చిదిద్దడంలో, దేశ సమగ్రతను కాపాడటంలో కాంగ్రెస్‌ పాత్ర గు రించి తెలుసుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. కాంగ్రెస్‌ దేశానికి ఏమి చేయలేదనే మోడీ ఆరోపణలను ఆమె ఈ సందర్భంగా తిప్పికొట్టారు. అసలు నిజాలు తెలుసుకోవడానికి చరిత్రను చదవాలని ఆమె సూచిం చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ 67 ఏళ్లలో దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్‌ ఎన్నో త్యాగాలు చేసిందని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికే అనేక వినూత్నమైన పథకాలను కాంగ్రెస్‌ తీసుకువచ్చిందని తెలిపారు. మోడీ ద్వేషపూరిత రాజకీయాలను నూరిపోస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశ ప్రజల్లో విభజన సృష్టించేందుకు కుట్ర పనుతున్నాడని ఆమె ఆరోపించారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనా బూటకమైనదని ఆమె అన్నారు. కార్పొరేట్లకు ప్రజాసంపదను ధారాదత్తం చేసి దానినే అభివృద్ధి అంటున్నాడని దుయ్యబట్టారు. అక్కడి ప్రజలు కనీసం జీవించడానికి సదుపాయాలు లేవని, తాగునీరు కూడా లేదని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ద్వారా దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడాలంటూ పిలుపునిచ్చారు.