ధనం, మద్యం ప్రవాహంలో ఏపీయే టాప్
రూ.133 కోట్లు స్వాధీనం
: సీఈసీ సంపత్
న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల సం దర్భంగా ఓటర్లను ప్ర లోభ పెట్టడానికి ధ నం,
మద్యం ప్రవాహంలో ఆంధ్రప్రదేశే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సంపత్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రూ.283 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అందులో సగం మేర మన రాష్ట్రంలోనే అధికారులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 2 వరకు రూ.131 కోట్ల నగదు, కోటీ లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం ప్రకటనతో మన రాష్ట్రంలో ఎన్నికలు ఎంత వ్యయభరితమైనవో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఎనిమిదో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 64 లోక్‌సభ నియోజకవర్గాల్లో బుదవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశ ఎన్నికల బరిలో 900 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎనిమిదో దశ ఎన్నికలతో మొత్తం 502 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. మిగిలిన 41 స్థానాలకు మే 12 ఎన్నికలు జరగనున్నాయి. తొమ్మిది దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మే 16న వెల్లడి కానున్నాయి. ఎనిమిదో దశలో కీలక వ్యక్తులు పోటీలో ఉన్నారు. రాహుల్ గాంధీ, ఆయన సోదరుడు వరుణ్‌గాంధీ, రాం విలాస్ పాశ్వాన్, రబ్రీదేవి, మహమ్మద్ కైఫ్, బేణీప్రసాద్ వర్మ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అమేథిలో రాహుల్ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఆప్ అభ్యర్థి కుమార్ విశ్వాస్, బీజేపీ నుంచి స్మృతి ఇరానీ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.