మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కన్నుమూత
హైదరాబాద్, మే 9 : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో కొద్ది కాలంగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేదురుమల్లి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1935 ఫిబ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడలో నేదురుమల్లి జన్మించారు. 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన మూడుసార్లు ఎంపీగా ప్రాతినధ్యం వహించారు. 1988లో పీసీసీ అధ్యక్షుడిగా నేదురుమల్లి పనిచేశారు. 1990 నుంచి 92 వరకు జనార్దన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
1998లో బాపట్ల, 1999లో నర్సారావుపేట నుంచి 2004లో విశాఖ నుంచి లోక్‌సభకు నేదురుమల్లి ఎన్నికయ్యారు. నేదురుమల్లికి భార్య రాజ్యలక్ష్మి, కుమారులు రాజ్‌కుమార్‌రెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. నేదురుమల్లి మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో ఉంది. స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకాడలో విషాదఛాయలు అలముకున్నాయి. నేదురుమల్లి భౌతికకాయాన్ని నిమ్స్ నుంచి సోమాజిగూడలోని నివాసానికి తరలించారు. జనార్దన్‌రెడ్డి మరణవార్త తెలియగానే కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు, అనుచరులు పెద్ద సంఖ్యలో నేదురుమల్లి నివాసానికి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి పల్లంరాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్య, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, వైసీపీ నేత మైసూరారెడ్డి తదితరులు జనార్దన్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.