తెలంగాణలో టీఆర్ఎస్‌, సీమాంధ్రలో జగన్‌ ప్రభుత్వం కేంద్రంలో యూపీఏకు మద్దతు : కేసీఆర్

  హైదరాబాద్, మే 9 : తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది టీఆర్ఎసే అని ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 60 సీట్లకు పైగా గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు 30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు.

హైదరాబాద్‌లోనూ గణనీయంగా సీట్లు గెలుస్తామని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలోనూ టీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని, ఖమ్మంలో భోణి కొట్టబోతున్నామని ఆయన వెల్లడించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పంట నష్టం ప్రాంతాల్లో గవర్నర్ నరసింహన్ పర్యటించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సీమాంధ్రలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ జోష్యం చెప్పారు. ఏపీలో జగన్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆయనకే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని, ఆమె చొరవ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఎన్డీఏకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు.

క్యాంపులు పెట్టుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్‌కు లేదని, ఇప్పటి వరకు ఎవరినీ సంప్రదించలేదని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ను చీల్చడం ఎవరి తరం కాదని ఆయన సవాల్ చేశారు. టీ.పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని కేసీఆర్ హెచ్చరించారు. పొన్నాలా బ్రోకరా? రాజకీయ వ్యభిచారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తమది తెలంగాణ వాదమని, కాంగ్రెస్‌ది చిల్లర రాజకీయమని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభా పక్షం నిర్ణయిస్తుందని కేసీఆర్ తెలిపారు. థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సీమాంధ్ర ఉద్యోగుల ఆప్షన్లకు మేం వ్యతిరేకమని కేసీఆర్ తెలిపారు. రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే పూర్తి స్థాయి విభజన జరుగుతుందని, పరస్పర అవగాహనతోనే పంపకాలు జరుగుతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం విలేకర్ల ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు.