బంగారు తెలంగాణ బాధ్యత మాదే..

కరీంనగర్ : పురపాలక సంఘం, జెడ్సిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఫలితాలను గమనిస్తే మే 16న వెలువడే సాధారణ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ కరీంనగర్ ఎంపి అభ్యర్థి, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు బి. వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో పురపాలక సంఘం, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు ఏక పక్ష విజయం అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.టిఆర్ఎస్ మేనిఫేస్టోని సాధారణ ప్రజలను చేరుకుందని, మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు చాలా సులభంగా అర్థమయ్యేలా ఉన్నాయని అన్నారు. మేనిఫెస్టోపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే తాము చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో 31 జెడ్సి స్థానాలకు గానూ 27 స్థానాలు టిఆర్ఎస్ గెలుచుకుందని, ఇది టిఆర్ఎస్‌కు మంచి పరిణామమని అన్నారు. కీలక సమయంలో కూడా జిల్లా ప్రజలు టిఆర్ఎస్‌ను ఆదరించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు.