మీరు చూడండి.. మేం పుంజుకుంటాం
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్
బెంగళూర్, మే 14 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీకి ఎత్తు పల్లాలు కొత్తకాదని, కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నా తాము పుంజుకుంటామని, శుక్రవారం నాటి ఎన్నికల ఫలితాల్లో అది తేటతెల్లమవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. బుధవారం బెంగళూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తాము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న లౌకికవాద రాజకీయాల కోసం పోరాడుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటూ చెప్పడం కొత్తకాదని, అయినా తాము పుంజుకొని దేశానికి సుస్థిర పాలన అందించామని తెలిపారు. 1977లో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ మీడియా రాసిందని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చామని, 89లో అదే తీరులో రాతలు రాసినా తాము అధికారాన్ని చేపట్టామని, 99లో కూడా తామే అధికారంలోకి వచ్చామని బదులిచ్చారు. అందుకే ప్రస్తుత ఎన్నికల్లోనూ తమ శక్తిని తక్కువగా అంచనా వేయద్దంటూ దిగ్విజయ్ పేర్కొన్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, 16వ లోక్‌సభ ఫలితాలు వెల్లడవుతాయని, ఆ రోజు అసలు విషయం బయటపడుతుందని అన్నారు. అన్ని సర్వేలు తమ పనైపోయిందంటూ రాసినా తాము 2004, 2009 ఎన్నికల్లో తాము ఓడిపోతామంటూ సర్వేలు ప్రకటించాయి, అయినా తామే అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూసిందని తెలిపారు. అయినా ఎన్నడూ సోషలిజం, లౌకికవాద సిద్ధాంతాల నుంచి తప్పుకోలేదని అన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు భిన్నమైనవని, బీజేపీ మతఛాందసవాదంతో తాము సోషలిస్టు, లౌకికవాదంతో ప్రజల మధ్యకు వెళ్లామని అన్నారు. బీజేపీ అభివృద్ధి అంశంపై ప్రచారాన్ని ప్రారంభించి చివరకు మతతత్వ రాజకీయాలను ఎత్తుకుందని ఆయన ఆరోపించారు. మతపరమైన కల్లోలాలు సృష్టించేందుకు, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని విమర్శించారు. అలాంటి వ్యక్తులే కనున అధికారంలోకి వస్తే దేశంలో లౌకికవాద పరిరక్షణకు తాము పాటు పడతామని చెప్పారు. రాహుల్‌గాంధీ నాయకత్వంపై పార్టీకి సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉందంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని, సీమాంధ్రలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదని అన్నారు. నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం కోసం డబ్బును ఖర్చు పెట్టిన తీరును చూస్తే మతిపోతుందని అన్నారు. ఆయనకు కార్పొరేట్ల అండదండలున్నాయన్నది దీనితో తేలిపోయిందన్నారు.