ఎన్‌డీఏలో చేరుతామన్నది పుకారే


ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌
న్యూఢిల్లీ, మే 14 (జనంసాక్షి) :
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై ఎన్డీయేతో బీజేడీ చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కండించారు. ఇప్పటివరకు తాము ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. దాని గురించి తామింకా ఆలోచించనే లేదని తెలిపారు. ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలని తెలిపారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తామని తాము హావిూ ఇవ్వలేదని తెలిపారు. బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని, తమ మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని తేల్చి చెప్పారు. 2004 ఎన్నికల ముందు వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేడీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేకు మద్దతిస్తుందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే, వాటిని నవీన్‌ పట్నాయక్‌ ఖండించారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందన్నారు. ‘అయినా ఇంకా ఎంతో కాలం నిరీక్షించాల్సిన అవసరం లేదు కదా.. రెండు రోజుల్లో తేలిపోతుంది కదా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఫలితాల అనంతరం ఎన్డీయేకు మద్దతిచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. తాము ఇంకా ఏ ఆలోచనలు చేయలేదన్నారు.