రేపటి నుంచి అసెంబ్లీ
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి
స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం
శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్
హైదరాబాద్, జూన్ 7 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సోమ వారం ఉదయం 9.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా కె.జానారెడ్డి రాజ్‌భన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలి పారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం అవుతుందని, అదే రోజు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మంగళవారం (10వ తేదీన) స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ సంప్రదాయాల ప్రకారం ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు యత్నిస్తామన్నారు. అన్ని పార్టీల
నిర్ణయంతోనే స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు హరీశ్ వెల్లడించారు. స్పీకర్ ఎన్నికపై అన్ని పార్టీలనూ సంప్రదిస్తున్నామని, ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని కోరామని తెలిపారు. బుధవారం 11వ తేదీన డెప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం బీఏసీ సమావేశం ఉంటుందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎన్ని గంటల పాటు చర్చ జరగాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుందని వివరించారు. ఇక మండలి విషయానికి వస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వాత మండలి తొలిసారి 9న సమావేశం కానుందని, అదే రోజు సభ్యులంతా మరోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత సభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేశారని, రాష్ట్ర విభజన నేపత్యంలో వారంతా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ మండలి చైర్మన్‌గా కొనసాగుతారని ఆయన చెప్పారు. 10న మండలికి సెలవు అని తెలిపారు. 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపేందుకు ఆదివారం సాయంత్రం కేబినెట్ సమావేశం ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగుతులపై ముఖ్యమంత్రి, స్పీకర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతీ ఎమ్మెల్యేకూ తన నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని దీనిపై అసెంబ్లీ సమావేశాల సమయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తత శాసనసభ మండలి డెప్యూటీ చైర్మనే ఇక నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.