బియాస్ దు:ఖదాయిని
ఆవిరవుతున్న ఆశలు
జాడ తెలియని బిడ్డలు
సిమ్లా, మే 16 (జనంసాక్షి) :బియాస్ దు:ఖదాయినిగా మిగిలింది. 16 మందిని తన పొట్టలో దాచుకొని గుంభనంగా ఉండి పోయింది. కనీసం వారి తల్లిదండ్రులకు కడ సారి చూపును కూడా దక్కకుండా చేస్తోంది. రోజులు గడుస్తుండటంతో
గల్లంతైన విద్యార్థుల ఆచూకీ లభిస్తుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు బలగాలు.. ముమ్మర గాలింపు.. అయినా అడుగు ముందుకు పడడం లేదు. నాలుగు రోజులుగా ఒక్కరి ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిని మానవ రహిత విమానం పసి గట్టలేకపోయింది. అత్యాధునిక స్కానర్ జాడ కనిపెట్టలేక పోయింది. ఫలితంగా సోమవారం కూడా ఒక్క మృతదేశం వెలికితీయలేదు. తమ వారి ఆచూకీ లభిస్తుందని, చివరి చూపునకు నోచుకుంటామని భావించిన తల్లిదండ్రులకు అది కలగానే మారేలా ఉంది. వారం రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు నిరాశగా తిరుగుపయనమయ్యారు. తమ వారి ఆచూకీ లభించక పోవడం కన్నీరుమున్నీరుగా విలపిస్తూ హిమాచల్‌ప్రదేశ్ నుంచి బయల్దేరారు.
తిరుగుముఖం పట్టిన తల్లిదండ్రులు
బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు ఈ నెల 8న గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రమాద విషయం తెలిసి తల్లిదండ్రులు తర్వాతి రోజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉండి తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. గాలింపు చర్యలను దగ్గురండి పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం ఎనిమిది మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా 16 మంది జాడ ఇంతవరకూ తెలియరాలేదు. గత నాలుగైదు రోజులుగా గాలింపు ముమ్మరం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. కానీ గత నాలుగు రోజులుగా ఒక్క శవాన్ని వెలికితీయలేక పోయారు. వరద ఉద్ధృతికి తోడు వర్షాల ప్రతికూల పరిస్థితులు గాలింపునకు ఆటంకంగా మారాయి. ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడుస్తున్న మృతదేహాలు లభ్యం కాకపోవడంతో కన్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వారిపై ఆశలు వదిలేసుకున్న తల్లిదండ్రులు సోమవారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
ధ్రువీకరణ పత్రాలు అందజేత..
బియాస్ నదిలోగల్లంతైన తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ధ్రువీకరణ పత్రాలు అందజేసింది. ఈ మేరకు మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లను అందజేసింది. అకస్మాత్తుగా నదిలో నీరు పెరగడం వల్లే విద్యార్థులు కొట్టుకుపోయారని ప్రభుత్వం ధ్రువీకరించింది. మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎఫ్‌ఐఆర్ కాపీలను అందజేసింది. అయితే, ధ్రువీకరణ పత్రాలపై హిమాచల్ ప్రభుత్వ రాజముద్ర లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజముద్ర ఎందుకు లేదని అధికారులను నిలదీశారు. కాగా, మరో వారం రోజుల పాటు గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు హామీ ఇచ్చారు. మృతదేహాలు లభ్యమైతే హైదరాబాద్‌కు తరలిస్తామని అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.
బాధ్యతలు మహేందర్‌రెడ్డికి..
గత వారం రోజులుగా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ప్రమాద విషయం తెలియగానే ఆయన హుటాహుటిన హిమాచల్‌ప్రదేశ్‌కు బయల్దేరి వెళ్లారు. అటు కేంద్రంతో, ఇటు రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించారు. వారం రోజులుగా మండీలోనే మకాం వేసి దగ్గరుండి గాలింపును పరిశీలించారు. అయితే, కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఉదయమే మండీకి చేరుకున్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి ఆయన బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను ఆయనకు వివరించి, తదుపరి చేపట్టాల్సిన ప్రణాళిక గురించి చెప్పారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ.. మరో వారం పది రోజుల పాటు గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అయినా విద్యార్థుల ఆచూకీ లభించడం లేదని చెప్పారు. చివరి మృతదేహాన్ని కూడా వెలికితీయాలని యత్నించామని, కానీ ప్రతికూల పరిస్థితులు సవాలుగా మారాయన్నారు. అయినా గాలింపు చర్యలు కొనసాగిస్తామని వివరించారు. ప్రమాద ఘటన, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆంకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న గాలింపు..
గల్లంతైన విద్యార్థుల కోసం సోమవారం కూడా గాలింపు చేపట్టారు. సోనార్ స్కానర్ పరికరంతో నదిని స్కానింగ్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. మరోవైపు, ఉదయం వేళ వర్షం కురియడంతో నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. పండో డ్యాం నుంచి నీటిని విడుదల చేసి గాలింపు చేపట్టాలని అధికారులు భావించగా తల్లిదండ్రుల అభ్యంతరం మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పండో డ్యాంకు దిగువన వలలు కట్టి నీటిని విడుదల చేయాలని భావించారు. అయితే, నీటి ఉద్ధృతికి మృతదేహాలు దారుణంగా దెబ్బతినే పరిస్థితి నేపథ్యంలో తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నీటిని విడుదల చేయాలనుకున్న అధికారులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు, రెండు, మూడ్రోజులుగా తీవ్రంగా కొనసాగిన గాలింపు సోమవారం మందకొడిగా సాగింది.
కళాశాల వద్ద ఆందోళన
హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ విద్యార్థులు ప్రమాదం బారిన పడ్డారని వారు ఆరోపించారు. తక్షణమే యాజమాన్యం ప్రతినిధులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల గల్లంతులో యాజమాన్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కాలేజీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అయితే, సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. డెత్, మిస్సింగ్ సర్టిఫికెట్లపై హిమాచల్ ప్రదేశ్ రాజముద్ర లేదని, చెల్లని కాగితాలను అప్పగించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.