మలి విడత మంత్రివర్గ విస్తరణ
హైదరాబాద్, జూన్ 24 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. కృష్ణా జలాల విడుదలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కృష్ణా నదీ జలాల వివాదం, మంత్రివర్గ విస్తరణ, ఢిల్లీ పర్యటన తదితర అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా నదీ జలాల వివాదంపైనే చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రపతి పాలన సమయంలో తాగునీటి కోసం కృష్ణా డెల్టాకు పది టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయించింది. జూన్ 25 నుంచి జూలై 9 వరకు ఈ నీటిని విడుదల చేయాలని ముహూర్తం నిర్ణయించారు. అయితే, నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదు. తాగునీటి పేరుతో నారుమళ్లకు నీటిని మళ్లించే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం తాగునీటి కోసమైతే రెండు టీఎంసీలు విడుదల చేసేందుకు సిద్ధమని చెబుతోంది. ఇందుకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఉంది. అయితే, ఇది వివాదంగా మారిన నేపథ్యంలో కేంద్ర జల సంఘం చైర్మన్, కృష్ణా యాజమాన్య బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌గా ఉన్న ఏబీ పాండ్యా మంగళవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో కేసీఆర్ గవర్న్‌తో సమావేశమయ్యారు. నదీ జలాల వివాదంపై ఆయన నరసింహన్‌కు వివరించారు. తమ వాదనలో హేతుబద్ధతను వినిపించారు. అలాగే, మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ గవర్నర్‌కు సమాచారమిచ్చినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే, బుధవారం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ తన పర్యటన ఉద్దేశ్యాలను కూడా నరసింహన్‌కు వివరించినట్లు సమాచారం.