ఏపీలో కార్చిచ్చు
పేదల బతుకుల్లో మంటలు
పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
గ్యాస్ పైపులైన్ లీకేజీతో 15 మంది సజీవ దహనం
కాకినాడ, జూన్ 27 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన కార్చిచ్చు 15 మందిని బలితీసుకుంది. మరెందరినో తీవ్రగాయాల బారిన పడేసింది. నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంది. తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ఓఎన్జీసీ పైపులైన్ పేలి 15 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో చోటు చేసుకుంది. ఓఎన్జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్)కు సవిూపంలో గ్యాస్ పైప్‌లైన్ లీకై శుక్రవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. గత కొద్దిరోజులుగా గ్యాస్ లీకై వాసన వస్తుందని స్థానికులు మొత్తుకుంటున్నా అధికారులు స్పందించకపోవడంతోనే ఈ విషాదం చోటు చేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీసీఎస్ కేంద్రంపై దాడికి దిగారు. మరోవైపు ఈ దుర్ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తదితరులు ఈ ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాద విషయం తెలియగానే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రధానికి సమాచారమిచ్చారు. అలాగే, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగి గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనపై విచారణకు కమిటీ వేసినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భద్రతపై నిర్దిష్టమైన వ్యవస్థ లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు ప్రధానికి వివరిస్తున్నామని చెప్పారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదని గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠి తెలిపారు. మామిడికుదురు మండలం నగరం గ్రామం వద్ద 18 అంగుళాల పైప్‌లైన్ వద్ద పేలుడు జరిగిందని చెప్పారు. ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదన్న ఆయన.. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
నిద్రలోనే సజీవదహనం
ప్రశాంతంగా నిద్రపోయిన గ్రామాస్తులకు ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు, మంటలు వారిని చుట్టుముట్టాయి. కొందరు నిద్రలో ఉన్న వారు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మరికొందరు మంటలను చూసి భయాందోళనతో పరుగులు తీశారు. ఓఎన్జీసీ కనెక్టింగ్ సెంటర్ నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించిన స్థానికులు ప్రాణాలను కాపాడుకొనేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు గాయాలతో తప్పించుకోగా, మరికొందరు మంటల్లో చిక్కుకొని మాడిపోయారు. మృతులంతా మాంసపు ముద్దల్లాగా మారిపోయారు. మొత్తం 15 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 250 విూటర్ల ఎత్తున మంటలు ఎగిసిపడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
నిర్లక్ష్యమే ‘మంట’పెట్టింది..
కొంతకాలంగా గ్యాస్ వస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా గురువారం అర్ధరాత్రి నుంచే గ్యాస్ చుట్టుపక్కల వ్యాపించింది. ఈ విషయాన్ని గమనించని స్థానికులు తెల్లవారుజామున లేచి రోజులాగే ఇంట్లో పొయ్యిలు వెలిగించే పనిలో ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు గ్రామాన్ని చుట్టేయడంతో ఊహించని రీతిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 50 ఇళ్లు, దుకాణాలు బూడిద కుప్పలుగా మారాయి. పదెకరాల కొబ్బరితోట పూర్తిగా మాడి మసైపోయింది. ప్రమాద విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల వారు తరలివచ్చి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. అప్పటికే 30 గ్రామస్తులు మంటల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు యత్నించినప్పటికీ మంటల ఉద్ధృతి కారణంగా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాద విషయం తెలిసి అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. గ్యాస్ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 13 మంది సజీవ దహనం కాగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలను వెలికితీసిన అధికారులు గాయపడిన వారిని అమలాపురం, కాకినాడ ఆస్పత్రులకు తరలించారు. వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమని వైద్యులు తెలిపారు.
స్థానికుల ఆగ్రహం.. జీసీఎస్‌పై దాడి
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానికులు మండిపడ్డారు. 20 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్లను ఆధునికీకరించక పోవడం, మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ పైపులైన్ లీకై వాసన వస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు జీసీఎస్ కార్యాలయంపై దాడికి దిగారు. జీసీఎస్ కార్యాలయం వద్ద ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పైపులైన్ లీకేజీపై చాలా రోజుల నుంచి చెబుతున్నా పట్టించుకోలేదని, ఫలితంగా ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.
హుటాహుటిన సహాయక చర్యలు
ప్రమాద ఘటన సమాచారం తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, ఎస్పీలను ప్రమాద స్థలానికి పంపించింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ¬ం మంత్రి చినరాజప్పను ఘటనా స్థలానికి పంపించారు. రంగంలోకి దిగిన అగ్నిమాకప సిబ్బంది, పోలీసులు, స్థానికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. ఆరు ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన కుదింపు
గ్యాస్ పైపులైన్ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన అక్కడి నుంచి తిరిగివచ్చారు. ఢిల్లీ నుంచే పరిస్థితిని సవిూక్షించిన ముఖ్యమంత్రి.. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా పర్యవేక్షించాలని ¬ం మంత్రిని ఆదేశించారు. అలాగే, పెట్రోలియం శాఖ మంత్రితో మాట్లాడిన బాబు.. ప్రమాదంపై సమాచారమిచ్చారు.
అనంతరం తన షెడ్యూల్‌ను రద్దు చేసుకొని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. నేరుగా ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మరోవైపు ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్యాస్ పేలుడుపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సంఘటన విషయం తెలియగానే ఆయన శుక్రవారం ఉదయం ఆంధప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు వల్ల పది అడుగుల గొయ్యి పడిందని తెలిసి ఆయన దిగ్భాంతికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధిత కుటుంబాల వెంట ఉండాలని ఆయన తెలిపారు. ఇంత పెద్దప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే తాను ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని, క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని ఆశిస్తున్నానని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం వద్ద గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు.
బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటాం : చంద్రబాబు
ఇదొక దురదృష్టకరమైన ఘటన అని, బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనాస్థలిని ఆయన కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేందప్రధాన్‌తో కలిసి సందర్శించారు. బాధితులను పరామర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఉదయం ప్రమాద వార్త తెలియగానే తన పర్యటన రద్దు చేసుకుని చమురు శాఖ మంత్రితో కలిసి రాజమండ్రి చేరుకున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వరకు అక్కడి నుంచి, ప్రమాదం జరిగిన తూర్పుగోదావరి జిల్లా నగరం వద్దకు చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఘటనాస్థలికి వచ్చారు. ఓఎన్‌జీసీ, గెయిల్ అధికారులు కూడా వారి వెంట వచ్చారు.
నిర్వహణా లోపమే కారణం
తూర్పు గోదావరి జిల్లా శుక్రవారం జరిగిన గెయిల్ పైపులైన్ పేలుడుకు గల కారణాలను ఆంధ్ర విశ్వివిద్యాలయం ప్రొఫెసర్ సీవీ రామన్ విశ్లేషించారు. పైపులైన్ల నిర్వహణ, ప్రమదాలు జరగడానికి గల కారణాలని అన్నారు. డెల్టాలో చమురు తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదం కాదు. ఇది కేవలం నిర్వహణలోపం వల్లే జరిగింది. పైపులైనును ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఈ తరహా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల, సమన్వయ లోపం వల్ల ఇలా జరిగింది. గెయిల్ అధికారుల దగ్గర్నుంచి స్థానిక పంచాయతీ సర్పంచి వరకు అందరి మధ్య సమన్వయం
ఉండాలి.
పైపులైన్ మీద ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. అందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని సాంకేతిక నిపుణులు పరిశీలించాలి. ఐదు, పదేళ్లకోసారి మాత్రమే చూస్తే లోపాలు కూడా సరిగ్గా తెలియవు. పాతికేళ్ల నాటి పైపులు అంటే.. వాటి జాయింట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.
మొత్తం 15మంది మృతి
గెయిల్ పేలుడు ఘటనలో మొత్తం 15మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి అధికారికంగా ప్రకటించారు. మరో 32మంది గాయపడ్డారని, వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆస్పత్రి సహా స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పద్మావతి చెప్పారు. కాగా అధికారికంగా 15మంది మృతి చెందినట్లు చెబుతున్నా 18మంది చనిపోయినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతి చెందినవారిలో గోపిరెడ్డి దివ్యతేజ, మద్దాల బాలాజీగా గుర్తించారు.
ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు
ఉదయం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం వద్ద జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ప్రమాదంలో 15 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. ¬టల్ యజమాని కుటుంబసభ్యులంతా మృతి చెందారని తెలిసి బంధువులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. ¬టల్ యజమాని జడికంటి వాసు, మధు, అనంతలక్ష్మి, కోకిల, చిన్నారులు బాలసుజిత, సాయిగణేశ్‌లు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.