త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
గవర్నర్‌ను కలిసిన కేసీఆర్
చైర్మన్‌గా కోదండరామ్?
హైదరాబాద్, జూన్ 28 (జనంసాక్షి) :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. టీపీఎస్సీ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం టీపీఎస్సీ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాన్ని రూపొందిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ దానిపై సంతకం చేసి గవర్నర్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం కేంద్రానికి ఆ దస్త్రం చేరుతుంది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలో భాగంగా టీపీఎస్సీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోద ముద్రతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడేందుకు మరో నెల రోజుల వరకు సమయం పట్టవచ్చు. ఆగస్టు నాటికి టీపీఎస్సీ ఏర్పాటవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏపీపీఎస్సీ భవనంలోని 3, 4 అంతస్తులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్, సభ్యులను ఏపీ కమిషన్‌లోనే కొనసాగాస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్‌కు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను చైర్మన్‌గా నియమించనున్నట్టు సమాచారం. అలాగే ఐఏఎస్ అధికారి కార్యదర్శిగా ఉంటారు. ప్రభుత్వం సభ్యులను నియమిస్తుంది. కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించిన నేపథ్యంలో ఆయనకు ఈ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. కోదండరామ్‌కు గతంలో సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ టిక్కెట్ ఇవ్వడానికి కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. కాని కోదండరామ్ దానిని తిరస్కరించారు. వీరిద్దరి మధ్య కొంత అంతరం ఉందని ప్రచారం జరిగినా కోదండరామ్ దానిని ఖండించారు. రానున్న కాలంలో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా సాగాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ కోదండకు కీలకమైన ఈ బాధ్యతలు అప్పగించే పనిలో ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ ఆలోచన చేయడం ద్వారా కోదండరామ్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. కోదండరామ్ విద్యావేత్త కూడా కనుక ఆయన ఈ పదవికి అర్హుడే అవుతారు. ఒకవేళ ఆయన రాజ్యసభ వంటి పదవులు అయితే బాగుంటుందని అనుకుంటే తప్ప, ఈ పదవి గౌరవప్రదమైనదే అని చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభకు అవకాశం లేదు. దీంతో ఆయనకు ఈ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇంకా తెలంగాణ భాష సంఘం తదితర పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నిర్ణయాలు జరుగవచ్చని సమాచారం.