ఎక్కడివారక్కడే

5A

రిటైర్మెంట్‌ పరిమితి 60కి పెంచండి

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయండి

పోలవరం ఆపండి

సీఎంను కోరిన టీఎన్‌జీవోలు

హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేసేలా నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని టీఎన్‌జీవోలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరారు. ఆదివారం టీఎన్‌జీవోలు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమల్‌నాథన్‌ కమిటీ సోమవారం తుది సమావేశం నిర్వహించి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయనున్నందున వారు సీఎంతో పలు విషయాలపై చర్చించారు. ఉద్యోగుల పంపిణీ మొత్తం పోస్టుల ఆధారంగా చేపట్టాలని, అలా కాకుండా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఆధారంగానే పంపిణీ చేసేందుకు కమల్‌నాథన్‌ కమిటీ యత్నిస్తోందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ భేటీ అనంతరం టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని, అదే సమయంలో నిరుద్యోగులకు ఇబ్బంది కలుగకుండా కొత్త నోటిఫికేషన్లు జారీ చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరామన్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఉద్యోగుల పంపకంలో కేంద్ర మార్గదర్శకాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీ చేయాలని, పదో పీఆర్సీ అమలుకు చర్యలు చేపట్టాలని కోరామన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే ఆదివాసీల పక్షాన ఉద్యమించే వారందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. ముంపు గ్రామాలను సీమాంధ్రలో వీలినం చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.